Reading Time: < 1 minute

ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్‎కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం

Caption of Image.

ముంబై: జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్‎కు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశ భద్రత, ఇంటెలిజెన్స్ రంగాలలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎంపికయ్యారు. శనివారం (ఆగస్ట్ 1) మహారాష్ట్రలోని పుణెలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అజిత్ దోవల్‎ ఈ అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్‌మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా లోక్‌మాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ ఈ పురస్కారాన్ని అందజేసింది. 

ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉద్యమకారులు చేసిన త్యాగాలను యువ భారతీయులు స్మరించుకోవాలని సూచించారు. దేశంలో ఇటీవల జరిగిన యువత నిరసనలను ఉద్దేశిస్తూ.. స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చింది చేయడం కాదని యువతకు పరోక్షంగా చురకలటించారు. స్వేచ్ఛతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని యువత అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

 యువత స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు చట్టబద్ధమైన పరిధిలోనే ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలను కాపాడటం, చట్టాన్ని గౌరవించడం పౌరుల ప్రాథమిక విధి అని చెప్పారు. స్వేచ్ఛను ఇష్టానుసారంగా ఏమైనా చేసే అనియంత్రిత హక్కుగా భావించవద్దని యువతను హెచ్చరించారు. భారతదేశ జాతీయ చైతన్యాన్ని తీర్చిదిద్దడంలో తిలక్ పోషించిన పాత్ర.. ఆయన జీవితం నుంచి యువతరం స్ఫూర్తి పొందాలని సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.