Reading Time: 2 minutes
Srsp Project Uttam Kumar Reddy Irrigation Update

SRSP Project Update: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టును సందర్శించి, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితులను సమీక్షించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, సుమారు 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు జీవనాడిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ పూడికతీత, సాగునీటి విడుదలపై స్పష్టత

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుండడాన్ని గుర్తించి, ప్రాజెక్ట్ పూడికతీతకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ నుండి సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు కొంత తక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితిని రైతులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీరు నింపకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. సాంకేతిక లోపాలు, డిజైన్ వైఫల్యాల వల్ల దెబ్బతిన్న ఈ మూడు ప్రాజెక్టుల పునరుద్ధరణ విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న శాస్త్రీయ చర్యలను సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కూడా ఏకీభవించిందని వివరించారు. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు.

కాంగ్రెస్ నిర్మాణాలే శాశ్వతం: మంత్రి ఉత్తమ్

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అది ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగమని స్పష్టం చేసిన మంత్రి.. దాన్ని కూడా తామే కట్టినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన డ్యాములు 60 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులు మాత్రం కొద్ది ఏళ్లకే ధ్వంసం అయ్యాయని ఎద్దేవా చేశారు.

దక్షిణ తెలంగాణ సాగునీటి పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ

కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాకుండా దక్షిణ తెలంగాణ సాగునీటి పరిస్థితులను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు కూడా ఎగువ నుండి నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని, రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.