
ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్‌లైన్‌లో ఒకే వేదికపై అందిస్తున్న తెలంగాణ మీసేవ అరుదైన రికార్డును నమోదు చేసింది. జూలై 31 న ఒక్క రోజే ఏకంగా 2,20,172 లావాదేవీలు నమోదైనట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దేశంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌గా మీసేవ నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా ప్రతి రోజు సరాసరి 70 నుంచి 80 వేల కార్యకలాపాలు జరిగే మీసేవలో.. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. వీటిలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల అప్లికేషన్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ డిజిటల్ సేవలపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని మంత్రి అన్నారు.
రాష్ట్ర పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు మీసేవ వేదికను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోంది. ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించడంలో విశేష కృషి చేసిన నిర్వాహకులు, సాంకేతిక బృందాలను మంత్రి అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలను జోడించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.