
ప్రముఖ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే సేవింగ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. హర్ ఘర్ లక్షపతి పేరుతో ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రికరింగ్ డిపాజిట్ రూపంలో ప్రతీ నెలా కొంతమొత్తంలో పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చు. రిస్క్ లేని పెట్టుబడితో పాటు క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునేవారి కోసం ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించారు. రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ నాటికి రూ.లక్షల వరకు పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
హర్ ఘర్ లఖపతి’ పథకం అంటే ఏంటి?
ఇది ఎస్బీఐ ఆధ్వర్యంలో నడుస్తు్న్న ఒక రికరింగ్ డిపాజిట్ పథకం. పెట్టుబడి పెట్టాలనుకునేవారు ప్రతీ నెలా కొంత మొత్తంలో నగదు జమ చేయాలి. మెచ్యూర్ పీరియడ్ కంప్లీ్ట్ అయిన తర్వాత మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు ఒకేసారి పొందవచ్చు. మీరు జమ చేసిన సొమ్ము పూర్తి సురక్షితంగా ఉంటుంది. ఎస్బీఐ ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం మీకు నిధులు అందుతాయి. మూడు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయించుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాలపరిమితిని బట్టి ప్రతీ నెలా ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ చెల్లించే డబ్బులు తక్కువగా ఉంటాయి. అదే తక్కువ కాలపరిమితి ఎంచుకుంటే చెల్లించాల్సిన సొమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇక వడ్డీ రేట్లలో మార్పుల వల్ల నెలవారీ చెల్లించే సొమ్ములో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు.
వడ్డీ రేట్లు ఎంతంటే..?
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇందుకు వర్తిస్తాయి. సాధారణ కస్టమర్లకు వార్షిక వడ్డీ 6.50 శాతం నుంచి 6.75 శాతం మధ్య ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ ఎస్బీఐ అందిస్తోంది. సింపుల్‌గా ఆన్లైన్‌లో లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి ఈ అకౌంట్ తెరవొచ్చు. కేవలం ఆధార్, పాన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఇక ఒక ఆర్ధిక సంవత్సరంలో లభించిన వడ్డీ రూ.40 వేలు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇక మీకు అవసరమైతే ఈ డిపాజిట్లపై రుణం లేదా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. ఏ నెలలోనైనా మీ వాయిదాను సకాలంలో చెల్లించకపోతే నిబంధనల ప్రకారం బ్యాంకు జరిమానా విధించవచ్చు. వరుసగా అనేక వాయిదాలు చెల్లించకపోతే మీ ఖాతాను మూసివేయవచ్చు.