
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం దగ్గర సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా మృతి చెందారు. శనివారం (ఆగస్ట్ 1) నిర్మల్ పుర్జా మృతిని అధికారులు ధృవీకరించారు. దీంతో బ్రాడ్ పీక్ పర్వతం దగ్గర సంభవించిన హిమపాతంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మిగిలిన వారి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
పీవోకేలోని కారకోరమ్ పర్వతశ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ (8,051 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించేందుకు బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్ మాజీ సభ్యుడు, ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) నేతృత్వంలో గురువారం 9 మంది పర్వతారోహకుల బృందం బయలుదేరింది. దాదాపు 7 వేల మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. ఈ క్రమంలో భారీ పర్వతంపై హిమపాతం సంభవించింది. దీంతో పర్వతారోహకులు అంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు.
శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికితీశారు. శనివారం (ఆగస్ట్ 1) నిర్మల్ పుర్జా మృతదేహాం లభ్యమైంది. మరో నలుగురి కోసం రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హిమపాతంలో చిక్కుకున్న బృందంలో ఆరుగురు నేపాలీలు కాగా, పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
ALSO READ : ట్రిపుల్ జంప్‌లో అదరగొట్టిన ప్రవీణ్, సెల్వప్రభు..
ఎవరీ నిర్మల్ పుర్జా..?
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్వతారోహకులలో నిర్మల్ పూర్జా ఒకరు. నేపాల్‌కు చెందిన పుర్జా 2019లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 14 శిఖరాలన్నింటినీ అధిరోహించి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. తద్వారా దక్షిణ కొరియా పర్వతారోహకుడు కిమ్ చాంగ్-హో రికార్డును పూర్జా బద్దలు కొట్టారు.
కిమ్ చాంగ్-హో ఏడేండ్లలో ఈ రికార్డ్ సాధిస్తే.. నిర్మల్ పూర్జా కేవలం ఆరు నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. పర్వతారోహకుడిగా మారకముందు పూర్జా 16 సంవత్సరాలు బ్రిటిష్ సైన్యంలో పని చేశారు. మొదట గూర్ఖా బ్రిగేడ్‌లో పనిచేసిన పుర్జా.. ఆ తర్వాత రాయల్ నేవీకి చెందిన ఒక ఉన్నత శ్రేణి ప్రత్యేక దళాల విభాగమైన స్పెషల్ బోట్ సర్వీస్‌లో విధులు నిర్వర్తించారు.