Reading Time: < 1 minute

కొత్త రకం ఆధార్ కార్డులు రాబోతున్నాయా: భూములు, ఇళ్ల ఓనర్లకు ఇవి ప్రత్యేకమా..

Caption of Image.

న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. దేశ పౌరులకు ప్రధాన, విశ్వసనీయ గుర్తింపు కార్డ్. ఈ ఆధార్ కార్డ్ తరహాలోనే ఢిల్లీ ప్రభుత్వం కొత్త కార్డులను తీసుకురాబోతుంది. కానీ ఈ కార్డు మనుషుల కోసం కాదు. భూములు, ఇండ్ల కోసం. అవును.. ప్రజల గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ ఉన్నట్లుగానే.. ఢిల్లీలోని భూములు, ఇండ్ల గుర్తింపు కోసం ప్రభుత్వం కొత్త డిజిటల్ కార్డులు తీసుకొచ్చే యోచనలో ఉంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం  ‘ఢిల్లీ భూ రికార్డుల బిల్లు-2026’ అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. 

ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. ఢిల్లీలోని ప్రతి ఆస్తిని (భూమి, భవనం) సర్వే చేసి ఆధార్ కార్డ్ తరహాలో ‘ప్రాపర్టీ ఆధార్ కార్డ్’ పేరుతో ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు కార్డును ప్రభుత్వం జారీ చేయనుంది. ఇందుకోసం ఢిల్లీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రకాల వ్యవసాయ, వాణిజ్య భూములు, భవనాలను డ్రోన్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతతో సమగ్రంగా సర్వే చేస్తారు. 

అపార్ట్మెంట్లలోని ప్రతి అంతస్తుకు వేర్వేరుగా డిజిటల్ రికార్డును సృష్టించి ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఈ వివరాలన్నింటిని ప్రభుత్వం ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్‌గా ప్రభుత్వం రూపొందిస్తుంది. ఈ ప్రాపర్టీ ఆధార్ కార్డ్‎లతో ఏండ్లకు ఏండ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, భూ క్రయవిక్రయాలు కూడా సులభతరం కానున్నాయి. 

ప్రాపర్టీ ఆధార్ కార్డుల అంశంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ఆధార్ కార్డు ప్రతి పౌరుడికి విశ్వసనీయమైన గుర్తింపు అందించినట్లే.. ఈ కొత్త చట్టం ద్వారా ఢిల్లీలోని ప్రతి ఆస్తికి సురక్షితమైన, ప్రామాణికమైన డిజిటల్ గుర్తింపును ఇవ్వనుందని పేర్కొన్నారు. ఢిల్లీ భూ రికార్డుల బిల్లు-2026కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.ఈ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.