
అమరావతి: అంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అక్కడి ఆర్టిసి శుభవార్త అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ అక్కడ పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టిసి బస్సులో హాల్ టికెట్ చూపిస్తే.. ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టిసి ప్రకటించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరిగే రోజుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టిసి ఎండి ఆదేశాలు జారీ చేశారు.