
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆయన సిఎం పదవి నుంచి వైదొలగనున్నారు. గురువారం ఈ విషయాన్ని నితీశ్ ఎక్స్ లో వెల్లడించారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బీహార్ ప్రజలకు నితీశ్ సందేశాన్ని పంపిస్తూ.. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకం తనను రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రానికి సేవ చేయడానికి దోహదపడిందని అన్నారు.
“రెండు దశాబ్దాలకు పైగా మీరు నిరంతరం నాపై నమ్మకం, మద్దతు ఉంచారు. ఆ విశ్వాసం బలంతోనే మేము బీహార్‌కు, మీ అందరికీ పూర్తి అంకితభావంతో సేవ చేసాం. బీహార్ ఉభయ సభలలో, పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిని కావాలనే కోరిక నాకు ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిని కావాలని నేను కోరుకుంటున్నాను. మీతో నా బంధం భవిష్యత్తులోనూ కూడా కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్‌ను నిర్మించడానికి మీతో కలిసి పనిచేయాలనే నా సంకల్పం స్థిరంగా ఉంటుంది. మీకు పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని నితీశ్ పేర్కొన్నారు.
కాగా.. రాజ్యసభకు ఎన్నికైతే, నితీష్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరో మైలురాయిని అందుకుంటారు. ఆయన గతంలో బీహార్ శాసనసభ, బీహార్ శాసన మండలి, లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎగువ సభలోకి ప్రవేశిస్తే.. ఆయన బీహార్ శాసనసభ ఉభయ సభలు, పార్లమెంటు ఉభయ సభలలో భాగమైన అరుదైన నాయకులలో ఒకరిగా రికార్డు సృష్టిస్తారు.
ఇదిలావుంటే, నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లితే.. బిహార్ సిఎంగా ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. జెడి(యు) వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వరకు నితీశ్.. ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలుస్తోంది.