
ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రేక్షక పాత్రను వహిస్తోంది. ఇరాన్‌పై రెండు దేశాల ముప్పేట దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ద్వయాన్ని ఒప్పించగల మధ్యవర్తిత్వం చేసే దేశాలు కరువైనాయి. నిరాయుధీకరణ నిత్య మంత్రం కావాలని ఐరాస బోధించడం మినహా చేసేది ఏమీ కనిపించడం లేదు. ఆయుధాలు, యుద్ధ వ్యాప్తి నిరోధక చర్యలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్న ఐరాస నేటి ఇజ్రాయిల్- అమెరికా సైనిక దాడులను ఆపమని ఒక్క మాట కూడా అనలేని నిస్సహాయ దుస్థితిలో ఉన్నది. ప్రపంచ శాంతి నెలకొనాలనే సదుద్దేశంతో 2022 నుంచి ఐరాస ప్రతి ఏటా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిస్‌ఆర్మమెంట్ అండ్ నాన్-ప్రొలిఫరేషన్ అవేర్‌నెస్) పాటించడం జరుగుతున్నది. అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలవల్ల కలిగే అపార నష్టాలను అవగాహన పరుస్తూ నిరాయుధీకరణ సూత్రాలను వ్యాప్తి చేస్తున్నది. సామూహిక వినాశన ఆయుధాల వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా అంతర్జాతీయ భద్రత, మానవాళి రక్షణ, శాంతి నెలకొంటాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. 1945లో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబు దాడుల విధ్వంసంతో 2 లక్షల మంది ప్రజలు మరణించగా, లక్షలాది మంది దీర్ఘకాలిక నష్టాలను కూడా నమోదు చేసుకున్నారు. 1945లో ప్రారంభమైన అణ్యాయుధ పరీక్షలు, దాదాపు నేటికీ 2,000 వరకు అణు పరీక్షలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికి 24 ఫిబ్రవరి, 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్- రష్యా యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. అదే విధంగా 07 అక్టోబర్, 2023 నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి అంతం కనిపించడం లేదు. నేడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ -అమెరికా మరో యుద్ధం కొనసాగిస్తూ క్షిపణుల వర్షంతో మధ్యప్రాచ్యం మంటల్లో భగ్గుమంటోంది. గల్ఫ్ దేశాల ఆకాశం బాంబు పేలుళ్లతో నల్లటి కారుమబ్బులతో నిండి ఉన్నది. నగరాలు, సైనిక స్థావరాలు, చమురు శుద్ధి కేంద్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర బాంబుల దాడితో ప్రపంచ శాంతి గాల్లో దీపమైంది. 3వ ప్రపంచ యుద్ధం రానుందా అనే వాదనలు బలపడుతున్నాయి. పిల్లిని గదిలో బంధించితే గత్యంతరం లేక తెగబడి ఎదురు తిరుగుతుందనే విషయం మనకు తెలుసు. నేడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇరాన్ అణు కార్యక్రమం మింగుడుపడని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా భీకర సైనిక దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మట్టుపెట్టడంతోపాటు ఖమేనీ సమీప బంధువులు/ కుటుంబ సభ్యులు, అగ్రనేతలు, ఉన్నత సైనిక అధికారులు, సహాయకులు కలుపుకొని ఇప్పటికీ 800లకు పైగా నిండు ప్రాణాలను కోల్పోయారు. 1989 నుంచి నిన్నటి వరకు ఇరాన్ సుప్రీం నాయకుడిగా మూడున్నర దశాబ్దాలకు పైగా తిరుగులేని నాయకుడిగా శాసించడం చూసాం. ఇరాన్‌లో పార్లమెంట్, న్యాయవ్యవస్థ, పోలీస్ విభాగం, మీడియా, మతపరమైన వర్గాలను తన అదుపులో ఉంచుకొని ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టులు చేయడం, మానవ హక్కులను హననం చేయడం, మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం, వ్యతిరేక ఉద్యమాలను అణచివేయడం తీవ్ర స్థాయిలో జరిగిపోయింది.
ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక మిలిటరీ, వైమానిక, నావికా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని వేల బాంబులను ఇజ్రాయెల్ -అమెరికాలు వేస్తున్నాయి. పశ్చిమాసిమాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ భీకర యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు ధరలు బంగారం వలే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్‌లో నిరంకుశ పాలన అంతం అయిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఇరానియన్ ప్రజలకు ట్రంప్ ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే మరి కొన్ని వారాలు కొనసాగుతుందని నెతన్యాహు -ట్రంప్ ద్వయం ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ యుద్ధం ముదురుతోంది. చమురు కేంద్రాలు భగ్గుమంటున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇరాన్ అణుకేంద్రాలు, సైనిక స్థావరాలను నేలమట్టం చేశాయి. ప్రతీకార జ్వాలలతో రగులుతున్న ఇరాన్ రగిలిపోతూ అమెరికా సైనిక స్థావరాలున్న 8 దేశాలపై ఏకకాలంలో దాడులు చేసింది. నేడు ఇరాన్ చేసిన ఎదురు దాడుల్లో బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీఅరేబియా, యుఎఇ దేశాల చమురు శుద్ధికేంద్రాలు ప్రభావితం అయ్యాయి. నేడు ఇరాన్ పక్షాన మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగుతున్నాయి. అమెరికా చర్చలకు సిద్ధమని ప్రకటించినా ఇరాన్ ససేమీరా అంటోంది.
‘స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్’ జలసంధి సముద్ర రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు సరఫరా ఆగిపోయింది. దీనితో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలకు చమురు రవాణా ఆగిపోయింది. 9 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇరాన్‌కు 6.10 లక్షల క్రియాశీల సైన్యం ఉన్నది. 28 ఫిబ్రవరి రోజున ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడుల్లో అపార ప్రాణ, ఆస్తినష్టాలు నమోదు అవుతున్నాయి. అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫలితంగా ఇరాన్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా వైమానిక, సముద్ర తలాల మీదుగా ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నామని అనుకున్న అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నాయి.
భారతదేశ చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నది. హోర్మోజ్ జల సంధి మూసివేయడంతో బ్యారెల్ ముడి చమురు ధరలు 80 డాలర్లకు చేరిందని, రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు గ్యాస్, ఖనిజాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, బంగారం, వెండి, వ్యవసాయ పరికరాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్, సబ్బులు, తలనూనె, ఎరువులు, బిస్కెట్లు, షాంపులు లాంటి అనేక నిత్యావసర సరుకుల దిగుమతులు భారమై, రవాణా దూరమై ధరలు పెరగనున్నాయి. ఈ జలసంధిని మూసివేయడంతో 13 దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు భారమైపోతున్నాయి. భారతదేశం రోజూ వినియోగించే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచి మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉండగా, మరో 25 రోజులకు సరిపడా చమురు రవాణా మార్గంలో ఉన్నాయని భారత ప్రభుత్వం వెల్లడిస్తున్నది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలతో దగ్గరి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ నేడు ఈ దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కరించుకోవాలని ప్రకటన చేయడం మినహా మరోమార్గం కనిపించడంతో లేదు. ట్రంప్- నెతన్యాహు ద్వయానికి సత్వరమే సద్బుద్ధి కలగాలని, ఇరాన్ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నది. ఏదిఏమైనా అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినం వేదికగా నేటి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయదని ఆశిద్దాం.
బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037