
అణు కార్యక్రమాలను ఇరాన్ విస్తరింప చేయడం ప్రపంచానికే ప్రమాదకరమని అవాస్తవాలు విస్తృతంగా ప్రచారం చేసి ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు భీకరంగా యుద్ధాన్ని సాగిస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇది ఇరాన్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం కోసంకాదు. ఇరాన్ అభివృద్ధిని కాంక్షించే కొత్త తరం పాలన అందించడానికి అంతకన్నా కాదు. ఇరాన్‌లో నిక్షిప్తమై ఉన్న అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవడానికి, తమకు గట్టి పోటీదారులుగా ఉన్న చైనా, రష్యాలను భౌగోళికంగా కుంగదీయడానికే. ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను గత ఏడాది జూన్‌లో తాము ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ మళ్లీ భూగర్భంలో అణుక్షేత్రాలను, బంకర్లను నిర్మించడం ప్రారంభించిందని, అందుకనే తాము అమెరికాతో కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఇంటర్వూలో వెల్లడించడం అబద్ధాలను మరోసారి వాస్తవాలుగా చిత్రీకరించినట్టు అయింది. అలాగే పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని ఆ పాలన అంతమొందిస్తేనే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని సమర్ధించుకున్నారు.
మొత్తం మీద ఇరాన్‌లో ఖమేనీ తరం పాలన అంతమొందాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాన లక్షంగా స్పష్టమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ముజ్తబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికైనట్టు వార్తలు వెలువడుతున్న తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్లని లక్షంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ నాయకుడిగా ఎవరు వచ్చినా అంతం చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటే తాము ఆడించే కీలుబొమ్మ ప్రభుత్వం ఇరాన్‌లో వచ్చే వరకు అమెరికా ఇజ్రాయెల్ మారణ కాండ తప్పకపోవచ్చు. మరోవైపు ఇరాన్‌లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించడానికి అమెరికా వ్యూహాలు రూపొందిస్తోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని అమెరికా నిఘా సంస్థ సిఐఎ పన్నాగాలు పన్నుతోంది. ఈమేరకు డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్థాన్ అధ్యక్షుడితో ట్రంప్ మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇరాన్, ఇరాక్ సిరియా, టర్కీల్లో విస్తరించిన కుర్దుజాతి కొన్ని దశాబ్దాలుగా తమకు స్వతంత్ర దేశం కావాలని పోరాడుతోంది. ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లో ఇరానియన్ కుర్దిష్ సాయుధ గ్రూపులకు వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి. ఈ బలగాలను కూడదీసుకోడానికి అమెరికా, ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి లక్షం ఇరాన్ ఇంధనం కొల్లగొట్టడం. ప్రపంచం మొత్తం మీద రెండవ భారీ చమురు, సహజవాయు నిల్వలు ఇరాన్‌లోనే ఉన్నాయి. అమెరికా చెప్పుచేతల్లోని కొత్త ప్రభుత్వం ఇరాన్‌లో పాలనా పగ్గాలు చేపడితే కేవలం చమురు విక్రయాలకే పరిమితం కాదు.
ప్రపంచ ఇంధన మార్కెట్ రూపురేకలనే మార్చి వేస్తుంది. ఇరాన్ ప్రధాన చమురు వినియోగదారు చైనా. ఆంక్షల యుగ వాణిజ్యంలో కీలక భాగస్వామి. రెండో అంశం చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కారిడార్ నిర్మాణంలో ఇరాన్ కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. తూర్పు ఆసియా ఐరోపా మధ్య ఈ కారిడార్ అనుసంధాన వంతెనలా పనిచేస్తోంది. ఏదైనా మార్పు వచ్చి అమెరికా రెగ్యులేటరీ పరిధి లోకి ఇరాన్ ఎగుమతులు వస్తే చైనా ఇంధన భద్రత బలహీనం కాక తప్పదు. మూడో అంశం ఇటీవల గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, ఇరాన్ దేశాలు చాలా సన్నిహితంగా ఉంటున్నాయి. పశ్చిమ దేశాల మార్కెట్ లోకి ఇరాన్ ఇంధనం తిరిగి ప్రవేశిస్తే ఐరోపాపై రష్యా ఆధిపత్యం నాటకీయంగా సన్నగిల్లుతుంది. ఇదిలా ఉండగా భౌగోళిక రాజకీయాల ప్రభావంలో మార్పు కనిపిస్తోంది. ఇరాన్‌లో అంతర్గతంగా అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలు దెబ్బతినడం, సామాజిక అశాంతి, ఇరాన్ పాలకులకు అగ్నిపరీక్షగా మారాయి. ఇరాన్ ప్రజల ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం పాలక వర్గంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. దీన్ని అమెరికా బాగా వినియోగించుకుంది.
ప్రజల్లో అసంతృప్తి కార్చిచ్చులా వ్యాపించింది. ఇరాన్ పాలన మార్పు విప్లవాన్ని పోలి ఉండనవసరం లేదు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ పతనంగా భావించనక్కర లేదు. అలాగే రాచరిక వ్యవస్థ పునరుద్ధరణ కాదు. ఉన్నత వర్గాల పునక్రమణిక ద్వారా పరివర్తన ఉద్భవించవచ్చు. అయితే ఇరాన్ ప్రాంతీయ సంక్షోభాలను ఇజ్రాయెల్ అమెరికా కూటమి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు. పశ్చిమ దేశాల వ్యవస్థలోకి ఇరాన్ ప్రవేశిస్తే ఫలితం కేవలం ఆంక్షల ఉపశమనంతోనే సరిపోదు. ఇది పశ్చిమాసియా నిర్మాణాత్మక పునర్ వ్యవస్థీకరణకు మార్గం అవుతుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ ఇరాన్ అనుసంధానం ఒకప్పుడు ఊహకు అందనిదైనా, అమెరికా పెత్తనం గొడుగు కింద ఆచరణాత్మక వాణిజ్య మండలంగా మారిపోతుంది. ఐరోపాకు ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా ప్రవాహం మాస్కోకు చోటు లేకుండా తుడిచిపెడుతుంది. చైనా యురేసియన్ కారిడార్‌కు ప్రమాణీకరణ అవసరం అవుతుంది. భూగర్భం లోని ఫలకలు చాలా అరుదుగా మారుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ సైద్ధాంతిక పునాదులతో స్థిరమైన దేశాల్లో అధికార పరివర్తన అంత సులువుగా జరగదు. అల్లకల్లోలం రేపుతుంది. ఇరాన్‌లో పాలన తరం మార్పు ఎలా జరుగుతుంది? అదేమైనా హింసాత్మకంగా మారుతుందా? ఎవరు ఇరాన్ దిశాదశను ఎలా మారుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.