
యురోపియన్ దేశం, నాటో మిత్రదేశం స్పెయిన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో స్పెయిన్ తన స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికా సైనిక దళాలను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని, వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తామని బుధవారం నాడు హెచ్చరించారు.స్పెయిన్ వైఖరి చాలా దారుణంగా ఉందని ట్రంప్ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. స్పెయిన్ తో అన్ని లావాదేవీలు నిలిపివేయాలని అమెరికా ఆర్థిక శాఖమంత్రి స్కాట్ బెసెంట్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. స్పెయిన్ తో అన్ని సంబంధాలను తాము తెగతెంపులు చేసుకుంటామని ప్రెసిడెంట్ అన్నారు.స్పెయిన్ లోని సోషలిస్ట్ నాయకత్వం ఇరాన్ పై దాడికి
ఉపయోగించే విమానాలను రీఫిల్లింగ్ ట్యాంకర్ లు తాము అనుమతించబోమని ప్రకటించడంతో దక్షిణ స్పెయిన్ లోని రోటా,మోరాన్ మిలిటరీ స్థావరాలనుంచి అమెరికా తమ 15 ఎయిర్ క్రాఫ్ట్ లను, రీఫిల్లింగ్ ట్యాంకర్ లను వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చింది. నాటో సభ్యదేశాలన్నీ తమ జీడీపీలో 5 శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలన్న అమెరికా పిలుపును స్పెయిన్ పట్టించుకోక పోవడం కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. అందువల్ల ఇక స్పెయిన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై స్పెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.ట్రంప్ తో సమావేశం అనంతరం జర్మన్ ఛాన్స్ లర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ గత సంవత్సరం అమెరికా -యురోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి స్పెయిన్ ను ప్రత్యేకంగా మినహాయించలేదని తాను ట్రంప్ తో ప్రత్యేకంగా చెప్పినట్లు పేర్కొనడం విశేషం.