Reading Time: < 1 minute

అబూధాబి ఎయిర్‌పోర్టులో ఘటన

సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె వాసి

కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కరీంనగర్: గల్ఫ్ యుద్ధం ప్రభావం ఓ తెలంగాణ కుటుంబంపై పడింది. అబూధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల దశలో అక్కడున్నన తెలంగాణ ప్రాంతపు వ్యక్తి ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డి పల్లెకు చెందిన ఎన్ రాజేశ్వర రావు అనే వ్యక్తి చాలా కాలంగా అబూధాబి ఎయిర్‌పోర్టులో హౌస్ కీపింగ్ విభాగంలో ఉద్యోగిగా ఉన్నాడు. మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్రతరం అయిన దశలో అబూధాబిపై ఇరాన్ సేనలు దాడులకు దిగుతున్నాయి.

ఈ దాడుల్లో తాను మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు రాజేశ్వర రావు ఫోన్‌లో తల్లిదండ్రులకు తెలిపారు. దీనితో ఊరిలో ఆయన కుటుంబంలో కలవరం చెలరేగింది. తమ కుమారుడికి ఏమైందో తెలియడం లేదని, ఏడాది నుంచి అక్కడ పనిచేస్తున్నాడని, గాయపడ్డట్లు తెలిసిందని , వీడియో కాల్ చేసి మాట్లాడాడని తండ్రి ప్రభాకర రావు వార్తా సంస్థలకు తెలిపారు. కొడుకు తిరిగి మన దేశం రావాలని కోరుకుంటున్నానని వాడు క్షేమంగా ఇంటికి చేరేలా ప్రభుత్వం చూడాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. తాను బాగానే ఉన్నానని చెపుతున్నాడని, అయితే తమకు వాడి పరిస్థితి గురించి దిగులు పట్టుకుందని, తిరిగి వచ్చేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు.

గల్ఫ్ ప్రాంతంలో దాడులతో అక్కడి పరిస్థితి దిగజారుతోంది. ఈ ప్రాంతంలోని పలు దేశాల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు అతికొది విమానాల రాకపోకలు ఆరంభం అయ్యాయి. బుధవారం కొందరు ప్రయాణికులు జెడ్డా, సౌదీ నుంచి బిక్కుబిక్కుమనుకుంటూ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమకు పెద్దగా ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదని తెలిపారు. దాడుల సమయంలో అబూధాబిలో తమకు సరైన ఏర్పాట్లు, సౌకర్యాలు ఉన్నాయని మదీనాకు వెళ్లి వచ్చిన అక్కడి నుంచివచ్చిన వారు తెలిపారు. మహ్మద్ అబ్దుల్ రజాక్ పలుసార్లు విమానాల రద్దు తరువాత క్షేమంగా హైదరాబాద్ చేరాడు. ట్రావెల్ ఏజెన్సీ వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేశారు.