Reading Time: < 1 minute

 మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇంధన సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఎటిఎఫ్) వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉందని, అయితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు. అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా, భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల అందుబాటుపై

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విస్పష్టం చేశారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులు (మంగళూరు, పాదూర్, విశాఖపట్టణంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు) పెంచుకోవడంతోపాటుగా దేశీయంగా చమురు ఉత్పత్తి, ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భారత్ గతంలో గల్ఫ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకునే పరిస్థితులుండేవని కేంద్రమంత్రి తెలిపారు. అయితే కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేయడంపై దృష్టిసారించిందని పేర్కొన్నారు. దీని కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా వేర్వేరు రూట్లలో మన దేశ ఇంధన సంస్థలు చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయని వెల్లడించారు.