Reading Time: 2 minutes
ఎయిర్ పోర్ట్ లాంచ్.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. టెర్మినల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టం అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. భారత్‌మాతా కీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ, అందరికీ నమస్కారం అంటూ తెలుగులో అభివాదం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పవిత్రమైన మాసంలో.. ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను, ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు ఇదో లాంచ్‌ ప్యాడ్‌ అని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వేగా, ఆంధ్రప్రదేశ్ యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్‌ను అభినందించారు.

అల్లూరి సీతారామరాజు నడియాడిన గొప్ప నేలపై నేడు ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. స్వర్ణాంధ్ర అభివృద్ధి లక్ష్య సాధనలో ఈ రోజు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో విమాన, రహదారి అనుసంధానం మరింత బలోపేతమై, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

గతంలో ఎయిర్ పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి, కానీ మేం వచ్చాక ఆ పద్దతిని మార్చాం. అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్ లో సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేశాం. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించాం. అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టాం అని తెలిపారు. దేశంలో 2014 కంటే ముందు 74 ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు 166 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయి. ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది. స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్ కాశీ నుంచి అమృత్ సర్ వరకు విస్తరించింది. దీని వల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారు అని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం..

ఉత్తరాంధ్రుల కల నెరవేరింది. విజయనగరం జిల్లా భోగాపురంలో ఐదువేల ఆరొందల కోట్ల రూపాయలతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవంలో మోదీ వెంట AP గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌, రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

13 వేల మందితో థింసా నృత్యం..

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో గిరిజనులు థింసా నృత్యంతో అదరగొట్టారు. 13వేల మంది విద్యార్థులు సంప్రదాయ చీరకట్టులో డాన్సులు చేస్తూ ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రధాని థింసా నృత్యాన్ని తిలకించారు. గిరిజనుల విద్యార్థులు చేసిన థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది. ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. డప్పుదరువుల నడుమ ఉత్తరాంధ్ర సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలతో అదరగొట్టారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన తప్పెట నృత్యకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.

మోదీకి ధన్యవాదులు: డిప్యూటీ సీఎం పవన్

భోగోపురం ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రధాని మోదీకి స్వాగతం చెబుతూ జనం జెండాలు ప్రదర్శించారు. అనంతరం మోదీని చంద్రబాబు పొందూరు ఖద్దరు శాలువాతో సత్కరించి వీణను బహూకరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విప్లవ వీరుడు అల్లూరి పేరు పెట్టడం గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ చెప్పారు. అల్లూరి స్ఫూర్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. AP అభివృద్ధికి చొరవ చూపుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు.

ఎర్ర బస్సు ఎక్కువన్నారు.. ఎయిర్ బస్ తెచ్చాం

ఎర్ర బస్సే ఎక్కువన్న ప్రాంతానికి ఎయిర్‌ బస్సు తెచ్చిన ఘనత కూటమి సర్కారు సొంతమని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో AP అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ప్రపంచమంతా ఉత్తరాంధ్ర వైపు చూస్తోందన్నారు. కూటమి సర్కారు ఘనతకు ఇదే నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రుల ఆకాంక్షలు నెరవేరాయని మంత్రి లోకేశ్‌ చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరగా పూర్తి చేసుకున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారడం ఖాయమన్నారు.

ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని వెంట గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు మురళీధర్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ జి.మల్లిఖార్జనరావు, జీఎం ఆర్‌ గ్రూపు బిజినెస్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌ రాజు పాల్గొన్నారు.