Reading Time: < 1 minute

మోడీ వికసిత్ భారత్, సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్: మంత్రి లోకేష్

Caption of Image.

ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు ప్రధాని మోడీ. శనివారం ( ఆగష్టు 1 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. మోడీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ ప్రతిరూపమే భోగాపురం ఎయిర్ పోర్ట్ అని అన్నారు. 

కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన‌ వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధాన‌మే అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవం అని అన్నారు లోకేష్. 

ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని.. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఏకంగా మన నమో వచ్చారని… ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్దమైందా రాజా.. అంటూ డైలాగ్స్ తో సభలో జోష్ నింపారు లోకేష్. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతా రామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని… ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుందని అన్నారు.  ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన నమో గారి వికసిత్ భారత్, మన సీబీఎన్ గారి విజన్ కలిసిన రోజు అని అన్నారు లోకేష్. 

ఈ నేలపై స్వాతంత్య్రం కోసం పోరాడింది అల్లూరి సీతారామరాజు అయితే.. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చింది మోడీ అని అన్నారు. రైతుల త్యాగం,కార్మిక కష్టం, చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం ఈ ఎయిర్ పోర్ట్ అని అన్నారు. అల్లూరికి ఉన్న పట్టుదల, పౌరుషం,దేశభక్తి మోడీలో కనిపిస్తుందని కొనియాడారు లోకేష్.

©️ VIL Media Pvt Ltd.