Reading Time: < 1 minute

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడనున్న రెండు స్థానాలకు తమ పార్టీలో 16 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో నలుగురు బిసి ముఖ్య నేతలు ఉన్నారని ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.సోమవారం వికారాబాద్‌కు వచ్చిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో తాను, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొంత సేపు చర్చించామని ఆయన చెప్పారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారని ఆయన చెప్పారు. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి ఢిల్లీకి పిలుస్తారా? లేక ఫోన్లో చర్చిస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఆశావాహుల జాబితా ఇవ్వాల్సిందిగా రాహుల్, కెసి వేణుగోపాల్ అడగడంతో సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్ల జాబితా ఇచ్చామని ఆయన వివరించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఏ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జస్టిస్ పి. సుదర్శన్ రెడ్డికి నష్టపరిహారంగా ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నదా? అని ప్రశ్నించగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తనకు రాజ్యసభ పదవి కావాలని అడగలేదని ఆయన స్పష్టం చేశారు.