Reading Time: 2 minutes

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు

బహ్రెయిన్‌లో ఎయిర్‌బేస్ ధ్వంసం

ఇంధన ట్యాంకులకు మంటలు

ఒమన్ పోర్టుపై డ్రోన్ దాడులు

ఖతార్‌లో ఇంధన కేంద్రంపై దాడి

కువైట్‌లో అమెరికా రాయబార కార్యాలయం లక్షం, మూసివేత

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం

మిలిటరీ శిక్షణ కార్యాలయంతో పాటు ప్రధాన ఆఫీసులు ధ్వంసం

టెహ్రాన్ విమానాశ్రయంపై ఉమ్మడి సేనల దాడి

లెబనాన్‌పైనా దాడులు, 40 మంది మృతి

నతాంజ్ అణు కేంద్రంపై దాడి నిర్ధారించిన ఐఎఈఏ

టెహ్రాన్/దుబాయి/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నాలుగో రోజూ యుద్ధం ఉధృతంగానే సాగింది. ఇరాన్, అమెరికాఇజ్రాయెల్ పరస్పర దాడులకు పాల్పడ్డాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది. అమెరికా స్థావరాలను లక్షంగా చేసుకుంది. బహ్రెయిన్ షేక్ ఇసాలోని అమెరికా ఎయిర్‌బేస్‌ను క్షిపణులు, డ్రోన్లతో ధ్వంస చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కాప్స్ ప్రకటించుకుంది. ఇంధన నిల్వ ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని, ఉవ్వెత్తున పొగలు ఎగిసినట్లు తెలిపింది. లక్ష్యాన్ని పక్కాగా ఢీకొట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది.

ఈ దాడిలో అమెరికా ప్రధాన హెడ్‌క్వార్టర్ ధ్వంసమైందని, ప్రధాన కార్యాలయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్లు సల్వంగా దెబ్బతిన్నాయని తెలుపుతూ సంబంధిత చిత్రాలను ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇక రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అరేబియా విజయవంతంగా కూల్చివేసింది. మరోవైపు ఒమన్‌లోని ‘రస్ అల్ జైమా’ పోర్టుపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంబంధిత వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖతార్‌లోని ఇంధన కేంద్రంపై కూడా జరిగినట్లు తెలుస్తోంది.

కువైట్‌లో రాయబార కార్యాలయంపైనా ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడడంతో దాన్ని మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇదిలావుండగా నాలుగు రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ మంగళవారంనాడు ‘ఎక్స్’లో వెల్లడించింది.

ఇరాన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ గురి…

ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా ఆ దేశ అధ్యక్షుడిపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. మంగళవారంనాడు టెహ్రాన్‌లో అధ్యక్ష కార్యాలయమే లక్షంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ శిక్షణ ప్రధాన కార్యాలయంపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దానితో పాటు ఇతర ప్రధాన కార్యాలయాను కూడా టార్గెట్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌లో అత్యంత సీనియర్ అధికారుల కాంపౌండ్‌లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

దక్షిణ ఇరాన్‌లోని అమెరికాఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది ఇరాన్ సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెహ్రాన్‌కు 500 మైళ్ల దూరంలోని కెరామిన్ ఎయిర్‌బేస్ లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఇదిలావుండగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ మేరకు టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హకీమే ఏరియాలో కూడా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలే లక్షంగా ఉమ్మడి సేనలు విధ్వంసానికి తెగబడినట్లు వెల్లడైంది.

లెబనాన్‌లో 40 మంది మృతి.. మరిన్ని బలగాలు పయనం

మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200మందికిపైగా గాయపడ్డారు. బీరూట్‌లోని దహియేలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది.

నతాంజ్‌పై దాడిని నిర్ధారించిన ఐఎఈఏ

ఇదిలావుండగా ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు నిజమేనని ఐఎఈఏ నిర్ధారించింది. కేంద్రానికి స్వల్పంగా నష్టం జరిగిందని, అయితే అణు ధార్మికత ప్రమాదం ఇప్పటికేమీ లేదని వెల్లడించింది. అణుకేంద్రంలోకి ప్రవేశించే క్రమంలో భూగర్భ ప్రవేశ ద్వారాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించామని తెలిపింది.

ఖాళీ చేసి రండి..

ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాలను లక్షంగా చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఆ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. బహ్రెయిన్, జోర్డాన్‌లలోని అత్యవసర సేవల సిబ్బంది మినహా మిగతా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేకపోతే స్వదేశానికి విచ్చేయాలని సూచించింది. భద్రతా పరమైన రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించింది.