
గతవారం అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడులలో సుప్రీ లీడర్ ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి చేసింది. దాడులలో మంటలు ఎగసి పడ్డాయి. డ్రోన్ మంటల్లో దూసుకుపోతూ, కెమెరాకు చిక్కింది. ఓడరేవు అంతటా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే గల్ఫ్ లోని దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులు, ఓడరేవులు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇరానియన్ షాహెద్ సూసైడ్ డ్రోన్లు జరిపిన ఇలాంటిదాడిలోనే సౌదీ అరేబియా లోని తనూరా శుద్ధి కర్మాగారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలకు అంతరాయం కలుగకుండా తక్షణం మూసివేశారు.
ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్మూలించే లక్ష్యంతోనే అమెరికా – ఇజ్రాయెల్ ఫిబ్రవరి 20 నుంచి ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. బాంబులు, వైమానికదాడులతో విరుచుకుపడుతుంటే, ఇరాన్ అమెరికా స్థావరాలు ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై ప్రతీకారదాడులు చేస్తోంది. మరో పక్క ప్రపంచంలో పలు దేశాలకు చమురు సరఫరాలు జరిగే సముద్రమార్గం అయినహోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరా ప్రకటించింది. దాని గుండా వెళ్లే ఏ నౌకనైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉండడంతో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలు జలసంధికి ఇరువైపులా నిలిచి పోయాయి.