Reading Time: < 1 minute

బెంగళూరు: ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయ్ నుంచి మంగళవారం సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను మూసి వేయడంతో దుబాయ్ విమానాశ్రయంలో సింధు చిక్కుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లిన సింధు, ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయింది. అయితే బెంగళూరు లోని తన ఇంటికి సురక్షితంగా చేరుకున్నట్టు తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించింది.

కష్ట సమయంలో చాలా కేర్ తీసుకున్న దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. దుబాయ్‌పై ఇరాన్ దాడి గురించి ప్రస్తావిస్తూ తాను ఉండే చోట పేలుళ్లు జరగడంపై స్పందిస్తూ “ఇలాంటి క్షణాలు సాధారణ జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మీకు గుర్తు చేస్తాయి.” అని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ ఉత్తేజాన్ని పొందిన తరువాత తదుపరి అడుగులు వేయాల్సి ఉందని తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చింది.