Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో గత రెండు రోజులుగా చర్చించి వారి క్షేమసమాచారం తెలుసుకుంటున్నారు. మంగళవారం ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్, కువాయిట్ రాజు షేక్ సబాహ్ అల్ ఖలేద్ అల్ హమాద్ అల్ ముబారక్ అల్ సబాహ్‌లతో అక్కడి భారతీయుల భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలిఫోన్ ద్వారా సాగిన సంభాషణల్లో అక్కడ నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత గురించి తెలుసుకున్నారు.

అంతకుముందు బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా రాజులతో చర్చించారు. ఆయా దేశాలపై ఇటీవల జరిగిన దాడులపై మాట్లాడుతూ ఈ క్లిష్టసమయంలో ప్రజల సాధికారతకు భారత్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో కూడా మోడీ చర్చించారు.