
టెహరాన్: ఇరాన్ సాగిస్తున్న ఎదురుదాడులు క్రమేపీ తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ దాడులలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారు. అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని అమెరికా సైనిక విభాగం సోమవారం తెలిపింది. ఘర్షణల్లో విజయం అంతా తమదే అనుకోరాదని, ఎక్కువ రోజులు సాగితే మరింతగా సైనిక ప్రాణనష్టం ఉండనే ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఈ దశలోనే అమెరికా అధికారికంగా ఈ దాడుల్లో తమ సైనిక సిబ్బంది చనిపోయిన విషయాన్ని నిర్థారించింది. కువైట్‌లో అమెరికా సైనిక సరఫరాల పర్యవేక్షణ విధుల్లో ఉన్న వారు మృతి చెందారని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా పలు ప్రాంతాల్లో బాధితులు అవుతున్న తమ సైనికులు, ఇతర సిబ్బందిని తాను అమెరికన్ హీరోలుగా గౌరవిస్తానని ట్రంప్ ఓ ఇంటర్వూలో చెప్పారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఎప్పటికప్పుడు తమ దాడులను ఉధృతం చేసి తీరుతామని, ఇక ట్రంప్ నెతన్యాహూలకు చుక్కలు చూపుతామని బెదిరిస్తున్నారు.యుఎస్ సెంట్రల్ కమాండ్ పరిస్థితి గడ్గుగా మరింత సంక్లిష్టంగా ఉందని తొలిసారిగా అంగీకరించింది.
దీర్ఘకాలిక పోరుకు ఇరాన్ సిద్ధం?
ప్రపంచ శాంతి అనేది ఇప్పుడు మధ్యప్రాచ్య ప్రాంత విస్తారిత పోరు ఎంతకాలం సాగుతుంది? ఏ మలుపు తిరుగుతుంది? అనే విషయంపై ఆదారపడి ఉంది. అయితే తమ దేశం దీర్ఘకాలిక పోరుకు సిద్ధంగా ఉందని ఇరాన్ రాజకీయ సీనియర్ వ్యక్తి అలీ లారిజని తెలిపారు. ఖమేనీ హత్యతో పరిస్థితి మారింది. ఎంతకాలం అయినా పోరుకు ఇరాన్ సిద్ధంగా ఉందని విశ్లేషించారు. చాలాకాలంగా ఎక్కువ కాలం పోరుకు అంతా సమాయత్తం అయి ఉన్నామని దీనిని గుర్తించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ నేత చెప్పింది నిజమైతే ప్రపంచ స్థాయిలో ఈ ఘర్షణ ప్రాంతీయ స్థాయి దశలో ఉన్నప్పటికీ చమురు సరఫరాల వ్యవస్థల క్రమంలో అంతర్జాతీయంగా పలు దేశాలపై పెను ఆర్థిక ముప్పునకు దారితీస్తుంది. కరోనా తరువాత తలెత్తే అతి పెద్ద ప్రపంచ ఆర్థిక సవాలు అవుతుందని నిపుణులు హెచ్చరించారు.
సౌదీ కీలక రిఫైనరీ రాస్ ధ్వంసం?
ఇరాన్ సేనలు సోమవారం జరిపిన డ్రోన్ల దాడుల్లో సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన రాస్ తనూరా రిఫైనరీ దెబ్బతింది. అయితే నష్టం వివరాలను సౌదీ అధికారులు తెలియచేయలేదు. కానీ ఈ రిఫైనరీని మూసివేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు సౌదీకి చెందిన అధికారిక చమురు సంస్థ సౌదీ ఆరామ్‌కో ప్రకటన వెలువరించింది. మూసివేత వరకూ పరిస్థితి వచ్చిందంటే తీవ్ర నష్టం వాటిల్లి ఉంటుందని అంతర్జాతీయంగా అనుమానాలు తలెత్తాయి. ఘటనలో ఎవరూ చనిపోలేదని అధికారికంగా తెలిపారు. కేవలం ముందు జాగ్రత్త చర్యగా మూసివేశామని వివరించారు. ఈ భారీ రిఫైనరీ రోజుకు అర మిలియన్ బ్యారెల్స్ ముడిచమురు శుద్ధి సామర్థతతో ఉంది. రెండు ఇరాన్ డ్రోన్లుతో దాడి జరిగిన విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపినట్లు అల్ అరేబియా టీవీ వార్తలు వెలువరించింది. ఈ రిఫైనరీ నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కువగా చమురు సరఫరా అవుతుంది. ఈ రిఫైనరీ మూసివేతతో క్రమేపీ ప్రపంచ దేశాలపై చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని విశ్లేసిస్తున్నారు. ఓ వైపు ఇరాన్ , ఇరాన్ మిత్రపక్ష తీవ్రవాద సంస్థలు తరచూ హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ల నౌకలను ఎంచుకుని దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో చాలా చమురు నౌకలను ఈ మార్గం గుండా పంపించేందుకు చమురు రవాణా సంస్థలు ఇష్టపడటం లేదు. దీనితో మరికొద్దిరోజులు ఘర్షణ సాగితే, ఇతర దేశాలకు కూడా ఉద్రిక్తతలు విస్తరిస్తే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు విఘాతం ఏర్పడుతుందని భయాందోళనలు నెలకొంటున్నాయి.
ఒమన్ తీరంలో నౌకపై ఇరాన్ దాడులు
మధ్యప్రాచ్య ఘర్షణల దశలో ఒమన్ తీరం వెంబడి ఇరాన్ సేనలు చమురు ట్యాంకర్ నౌక ఎంకెడి వివైఒఎంపై దాడికి దిగాయి. ఈ క్రమంలో నౌకలోని సిబ్బందిలో ఒక భారతీయుడు దుర్మరణం చెందారు. చమురు ట్యాంకర్‌పై బాంబుల వర్షం కురియడంతో మంటలు అంటుకున్నాయి.