Reading Time: < 1 minute
Telangana Auto Cab Strike Cancelled Government Talks

Telangana Auto Strike : నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాలనుకున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను ఆటో, క్యాబ్ కార్మికులు విరమించుకున్నారు. రవాణా శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఫలించిన చర్చలు.. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం

ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చర్చల్లో జూమ్ (Zoom) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంత్రి , అధికారుల హామీతో సంతృప్తి చెందిన కార్మిక నాయకులు సమ్మెను విరమించేందుకు అంగీకరించారు.

త్వరలోనే జీవో విడుదల చేయాలని డిమాండ్

తమ ప్రధాన డిమాండ్లైన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఛార్జీల పెంపునకు కమిటీ, ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు (G.O.) విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేటి అర్ధరాత్రి నుంచి జరగాల్సిన ఆటో, క్యాబ్, స్కూల్ బస్సుల సమ్మె రద్దు కావడంతో ప్రజలు, ముఖ్యంగా నిత్య ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.