
AK-203: విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, భారత్ పూర్తిగా స్వదేశంలోనే, స్వదేశీ ముడి పదార్థాలతోనే తయారైన AK-203 రైఫిల్‌ను ఆవిష్కరించింది. దీనికి ‘షేర్’ అని పేరు పెట్టారు. ఈ రైఫిల్ ఆటోమేటిక్, బరస్ట్ ఫైరింగ్ టెస్టుల్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. 2019లో భారత్, రష్యా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా AK-203 రైఫిళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఏర్పాటైంది. భారత్‌లో తయారైన రైఫిళ్లలో మొదటగా దిగుమతి చేసుకున్న కిట్‌లను ఉపయోగించగా, ఇప్పుడు దేశీయ భాగాల వాటాను పెంచారు.
తాజాగా తయారైన షేర్‌లో ప్రతీ విడిభాగం, ముడి పదార్థం భారత్‌లోనే తయారైంది. కేవలం రైఫిల్‌ను భారత్‌లో అసెంబుల్ చేయడమే కాకుండా, దాని తయారీకి అవసరమైన ప్రతీ వస్తువును భారత్‌లోనే దేశీయంగా అభివృద్ధి చేశారు. AK-203లో సుమారు 50 ప్రధాన భాగాలు, 180 ఉప భాగాలు, దాదాపు 120 తయారీ ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నింటినీ భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసేందుకు IRRPL అనేక దేశీయ సరఫరాదారులను అభివృద్ధి చేసింది.
AK-203 7.62×39 మిమీ కార్ట్రిడ్జ్‌ను ఉపయోగించే గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్ అసాల్ట్ రైఫిల్. ఫోల్డింగ్, అడ్జస్టబుల్ స్టాక్, ఎర్గోనామిక్ గ్రిప్, ఆధునిక ఆప్టికల్ పరికరాలను అమర్చేందుకు రైల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్‌కు దీనిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తున్నారు. మొత్తం 6,01,427 AK-203 రైఫిళ్లను తయారు చేసే కాంట్రాక్ట్ ఉంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.5,200 కోట్లు. ఉత్పత్తి గడువును కూడా అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కు ముందుకు తీసుకొచ్చారు. ఈ లెక్కన కోర్వా ప్లాంట్ ప్రతీ రోజు 600 రైఫిళ్లను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతీ 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారు కావాలి. ఈ రైఫిళ్లలో వాడుతున్న దేశీయ వస్తువులు 2025 మధ్య నాటికి 50 శాతం ఉండగా, ఇది ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది. ఈ రైఫిళ్లపై భారత సైన్యం యూజర్ ట్రయల్స్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ రైఫిళ్లను భారత సైన్యానికి అందచేసి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.