
హైదరాబాద్: ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం అయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆటో కార్మిక సంఘాల నిరవధిక బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆటో కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు రావడంతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని, అది దుష్ప్రచారం మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది.
విధివిధానాలకు సెప్టెంబర్ 1వ తేదీ కార్మిక శాఖ, రవాణా శాఖ.. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నాయి. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదని.. అందువల్ల ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో యాప్స్ మాదిరిగా ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ నుంచి యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రక్రియ మొదలుపెడతామని రవాణా శాఖ తెలిపింది.
ద్విచక్ర వాహనాల్లో ర్యాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు 12 వేల రూపాయల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి,సహచ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
►ALSO READ | కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి.. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు.. : పీసీసీ చీఫ్
హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రో ఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి 1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని చెప్పారు. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవీ ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆటో కార్మిక సోదరుల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.