
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా 120కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. నటీనటుల భావోద్వేగాలు, హావభావాలు, నటనను సహజంగా ప్రేక్షకులకు చేరవేయాలంటే మానవ స్వరం, డబ్బింగ్ ఆర్టిస్టుల పనితీరే కీలకమని రాజమౌళి భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అందుకే ‘వారణాసి’ని వివిధ భాషల్లోకి డబ్ చేయడానకి ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా.. ఆయా భాషలకు చెందిన ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో వర్క్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాల నటన, భావోద్వేగాలు మరింత ప్రభావవంతంగా చేరేలా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ యాక్షన్, సరికొత్త మేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 120కి పైగా దేశాలు, 50కి పైగా భాషలు, 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులతో ‘వారణాసి’ గ్లోబల్ రిలీజ్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.