July 12, 2026

భారీ డిస్కౌంట్లకు బై బై..! ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌ డే సేల్స్‌‌‌‌‌‌‌‌, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో భారీ ఆఫర్లు లేనట్టే…

భారీ డిస్కౌంట్లకు బై బై..! ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌ డే సేల్స్‌‌‌‌‌‌‌‌, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో భారీ ఆఫర్లు లేనట్టే...
Reading Time: 2 minutes

భారీ డిస్కౌంట్లకు బై బై..! ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌ డే సేల్స్‌‌‌‌‌‌‌‌, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో భారీ ఆఫర్లు లేనట్టే…

Caption of Image.
  • ముడి సరుకుల ధరలు పెరగడంతో.. రాయితీలు తగ్గించిన కంపెనీలు
  • వస్తువుల ధరలు పెంచినా, లాభాలు పడిపోతున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ: యాభై శాతం తగ్గింపు,  బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌, ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ బోనస్‌‌‌‌‌‌‌‌ .. పండుగ టైమ్‌‌‌‌‌‌‌‌లో లేదా ఎండ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ సీజన్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి ఆఫర్లు చాలా చూసి ఉంటాం. కానీ, ఈ ఏడాది మాత్రం ఇలాంటి భారీ డిస్కౌంట్లు కనిపించకపోవచ్చు.  ముడిసరుకుల ధరలు పెరగడంతో ఖర్చుల భారం ఎక్కువైందని కంపెనీలు అంటున్నాయి. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లు వంటివి అమ్మే కన్జూమర్ గూడ్స్ కంపెనీలు డిస్కౌంట్లను ఇవ్వడం తగ్గించేశాయి.   

అంతర్జాతీయంగా రవాణా ఛార్జీలు పెరగడంతో  కంపెనీలు తమ లాభాలను నిలుపుకోవడానికి డిస్కౌంట్లకు కోత పెడుతున్నాయి.  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్లలో గతేడాదితో పోలిస్తే ఆఫర్లు 5 నుంచి 10 శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం ‘ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్‌‌‌‌‌‌‌‌’  నడుస్తున్నప్పటికీ,  గతంలోలాగా అన్ని వస్తువులపై కాకుండా చాలా పరిమితమైన ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌పై మాత్రమే ఆఫర్లు కనిపిస్తున్నాయి. 

ముడిసరుకు ధరలు పైపైకి

పశ్చిమాసియాలో  నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో వస్తువుల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ భారాన్ని కంపెనీలు కస్టమర్లపై పూర్తిగా మోపలేకపోతున్నాయి. ఉదాహరణకు, ఏసీల ధరలు 12శాతం పెరిగినా,  కంపెనీలు మరో 5-–6శాతం అదనపు భారాన్ని  భరిస్తున్నాయి. దీంతో  కస్టమర్లకు ఇచ్చే రాయితీలను తగ్గించుకోవాల్సి వస్తోంది. కోడక్, థామ్సన్ బ్రాండ్ల టీవీలు తయారుచేసే  సూపర్ ప్లాస్ట్రానిక్స్  సీఈఓ అవ్​నీత్ సింగ్ మార్వా  మాట్లాడుతూ,  “రవాణాలో  అంతరాయాల కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. 

రానున్న ఇండిపెండెన్స్ డే సేల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా గతంలో మాదిరి భారీ డిస్కౌంట్లు కనిపించవు” అని తెలిపారు. డిస్కౌంట్లు తగ్గడంతో  కస్టమర్లు వెనకడుగు వేయకుండా ఉండేందుకు వ్యాపారులు సరికొత్త పద్ధతులను పాటిస్తున్నారు.  ‘‘ క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లను తగ్గించినప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి లాంగ్‌‌‌‌‌‌‌‌టర్మ్‌‌‌‌‌‌‌‌  ఈఎంఐలు,  ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి” అని విజయ్ సేల్స్  డైరెక్టర్ నీలేష్ గుప్తా తెలిపారు.  ఎక్కువ మంది వినియోగదారులు నెలకు కొంత చొప్పున  కట్టేందుకే ఇష్టపడుతుండటంతో ఈ స్ట్రాటజీ పనిచేస్తుందని అన్నారు.  

మరోవైపు, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ ఇంటర్నేషనల్, వీ-మార్ట్ రిటైల్, బాటా ఇండియా వంటి ప్రముఖ బ్రాండ్లలో ఎలాంటి డిస్కౌంట్లు లేకుండా  పూర్తి ధరలకే  అమ్మకాలు జరుగుతున్నాయి. పూర్తి ధరతో అమ్ముడవుతున్న వస్తువుల వృద్ధి డబుల్ ఉందని  బాటా ఇండియా పేర్కొంది. డిస్కౌంట్లు లేకపోయినా మార్కెట్లో డిమాండ్ స్థిరంగా ఉండటంతో కంపెనీల వద్ద పాత స్టాక్ పేరుకుపోవడం లేదని తెలిపింది.

రంగాల వారీగా పెరిగిన ధరలు

మార్కెట్ ట్రాకర్ ‘కౌంటర్‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్’ రిపోర్ట్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్,  స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్లు ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీపై ఇచ్చే డైరెక్ట్ డిస్కౌంట్లు, క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆఫర్లు,  బ్యాంక్ కార్డ్ ఆఫర్లు 5 నుంచి 7 శాతం మేర తగ్గాయి. 

గత ఆర్నెళ్లలో ఎలక్ట్రానిక్స్​, ఫుట్​వేర్​పై డిస్కౌంట్ల తగ్గుదల ఇలా..

 

©️ VIL Media Pvt Ltd.