సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా తప్పించుకోవచ్చు..

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మధ్యే తిరుమల కాలినడక బాటలో చిరుత సంచారం భక్తులను భయపెట్టింది. జనావాసాల్లోకి వస్తున్న పులులు ఆవులు, గేదెలు, గొర్రెలపై దాడులు చేస్తూ రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులుల జీవన విధానం ఎలా ఉంటుంది? అడవిలో పులి అకస్మాత్తుగా ఎదురైతే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే అంశాలపై ఐఎఫ్ఎస్ అధికారిణి శ్వేత బొడ్డు, వన్యప్రాణి నిపుణుడు సంజయ్ ఛిమ్వాల్ కీలక విషయాలు వెల్లడించారు. మనం పులిని అత్యంత శక్తివంతమైన వేటగాడిగా భావిస్తాం. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం పులి వేట సక్సెస్ రేటు మనం అనుకున్నంత ఎక్కువగా ఉండదు. పులి చేసే ప్రతి 10 వేట ప్రయత్నాలలో కేవలం ఒక్కసారి మాత్రమే దానికి విజయం దక్కుతుంది. వేట కోసం పులి చాలా శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అది చిన్న జింకలు, కుందేళ్ల కంటే.. భారీగా ఉండే అడవి దున్న వంటి పెద్ద జంతువులను వేటాడటానికే ప్రాధాన్యత ఇస్తుంది. పెద్ద జంతువును వేటాడితే దానికి ఎక్కువ రోజులు ఆహారం లభిస్తుంది. ఒకసారి పూర్తిస్థాయిలో వేటాడి తిన్న తర్వాత, పులి దాదాపు 10 రోజుల వరకు మళ్లీ వేటాడకుండా ఉండగలదు. సాధారణంగా ఒక పులి నెలకు 3 నుంచి 4 సార్లు మాత్రమే వేటాడుతుంది. మిగిలిపోయిన ఆహారాన్ని నక్కలు, హైనాలు తింటాయి.
టెరిటోరియల్ జంతువులు: పరిధి దాటితే పోరు తప్పదు
పులులు అత్యంత స్వతంత్ర, సొంత భూభాగ పరిధి కలిగిన జంతువులు. ప్రతి మగ పులి తన బలాన్ని బట్టి అడవిలో కొంత ప్రాంతాన్ని తన సరిహద్దుగా మార్చుకుంటుంది. అడవిలో నడుస్తున్నప్పుడు చెట్లపై తన గోళ్లతో గీతలు పెట్టడం, ప్రతి కొద్ది దూరానికీ యూరిన్ స్ప్రే చేయడం ద్వారా తన భూభాగాన్ని మార్క్ చేస్తుంది. ఈ వాసన గుర్తులు ఇతర మగ పులులకు స్పష్టమైన హెచ్చరికలు. ఒక మగ పులి పరిధిలోకి మరో మగ పులి వస్తే తీవ్రమైన సరిహద్దు పోరాటాలు జరిగి, ఒకదాని ప్రాణం పోయే వరకు దారితీస్తాయి. అయితే ఆడ పులులు మాత్రం ఒకరి పరిధిలోకి మరొకరు రావడం సాధారణమే.
అడవిలో పులి, చిరుత ఎదురైతే..
జంతువులు సాధారణంగా అవసరం లేనిదే మనుషులపై దాడి చేయవు. ఒకవేళ అడవిలో లేదా కొండ ప్రాంతాల్లో క్రూర మృగాలు ఎదురైతే భయాందోళనలో చేసే కొన్ని తప్పులే ప్రాణాల మీదకు తెస్తాయి. నిపుణులు సూచిస్తున్న రక్షణ చర్యలు ఇవే:
పరుగెత్తవద్దు, అరవద్దు: పులిని చూడగానే భయంతో కేకలు వేయడం, రాళ్లు విసరడం లేదా వెనుతిరిగి పారిపోవడం అస్సలు చేయకూడదు. మీరు పరుగెడితే పులి మిమ్మల్ని తన ఎరగా భావించి మరింత వేగంగా దాడి చేస్తుంది.
కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి: నిశ్చలంగా నిలబడి, జంతువు కళ్లలోకి నేరుగా చూస్తూ చాలా నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి. ఎదురుగా ఉన్న జీవి తన వైపే చూస్తుందని గమనించినప్పుడు, పులి అది తన ఆహారం కాదని భావించి పక్కకు వెళ్లిపోయే అవకాశం ఉంది.
వంగడం లేదా దాక్కోవడం వద్దు: పొదల్లో దాక్కోవడం, కింద కూర్చోవడం చేయకూడదు. అలా వంగినప్పుడు పులి దృష్టిలో మీ పరిమాణం చిన్నగా అయి, సులభమైన శత్రువుగా కనిపిస్తారు. రెండు కాళ్లపై నిటారుగా నిలబడి పెద్దగా కనిపించాలి. (ఉదాహరణకు ఎలుగుబంటి పులికి ఎదురైనప్పుడు రెండు కాళ్లపై నిలబడి తన ఆకారాన్ని పెద్దదిగా చూపిస్తుంది, దాంతో పులి వెనక్కి తగ్గుతుంది).
చెట్లు ఎక్కడం: పులి పూర్తిగా మన వైపు చూడనప్పుడు లేదా దాని దృష్టి మళ్లినప్పుడు నెమ్మదిగా వెనక్కి జరిగి, వీలైతే సమీపంలోని ఇల్లు, వాహనం లేదా ఎత్తైన చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే పులులు చెట్లను అంత వేగంగా ఎక్కలేవు.
అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక సూచనలు
పశువుల కాపరులు, కట్టెల కోసం అడవికి వెళ్లేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి..
గుంపుగా వెళ్లండి: ఒంటరిగా ఉన్నవారి కంటే గుంపుగా ఉన్నవారిపై దాడి చేయడానికి వన్యప్రాణులు సాహసించవు. నడుస్తున్నప్పుడు పిల్లలను, వృద్ధులను ఎల్లప్పుడూ గుంపు మధ్యలో ఉంచుకోవాలి.
సమయం ముఖ్యం: క్రూర మృగాలు సాధారణంగా తెల్లవారుజామున లేదా సాయంత్రం సంధ్యా సమయాల్లో వేటాడతాయి. కాబట్టి మధ్యాహ్నం వేళల్లో మాత్రమే అడవి పరిసరాల్లోకి వెళ్లడం కొంతవరకు సురక్షితం. రాత్రిపూట కొండ ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దు, తప్పనిసరైతే హైబీమ్ టార్చ్ లైట్ వాడాలి.
ఆధారాలు గమనించండి: అడవిలోకి ప్రవేశించే ముందే జంతువుల అడుగుజాడలు, వాటి విసర్జితాలు లేదా పక్షులు, కోతుల హెచ్చరిక అరుపులను గమనించాలి. అనుమానంగా ఉంటే వెనుతిరగడమే మంచిది. చేతిలో ఎల్లప్పుడూ ఒక లాఠీ లేదా గట్టి కర్రను ఉంచుకోవడం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
శాశ్వత పరిష్కారం ఏమిటి?
గ్రామస్తులు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పొదలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నివాస ప్రాంతాల వద్ద బహిరంగంగా ఆహార వ్యర్థాలు, చెత్త వేయకూడదు. ఎందుకంటే ఆ చెత్త కోసం వచ్చే అడవి పందులు, కుక్కలను వేటాడటానికే పులులు, చిరుతలు గ్రామాల్లోకి ఆకర్షించబడతాయి. కేవలం తాత్కాలిక అప్రమత్తత మాత్రమే కాదు… అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సహజ ఆవాసాలను దెబ్బతీయకుండా కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఈ మానవ-మృగ ఘర్షణలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వన్యప్రాణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.