Reading Time: < 1 minute
Visakhapatnam Earthquake 4 5 Magnitude Tremors Shake Vizag Residents Rush Out Of Homes

Visakhapatnam Earthquake: విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు.. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని సాగర్‌ నగర్, పెదవాల్తేరు సహా పలు కాలనీల్లో ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, సాగర్‌ నగర్, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్‌లో ఆదివారం ఉదయం 5.08 గంటలకు భూమి కంపించింది. బంగాళాఖాతంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప ప్రభావంతో విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగరం మొత్తంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.