Reading Time: 2 minutes
Keerthy Sureshs Satyavan Savitri Release Date Out Courtroom Drama Set For 2026 July 24

Keerthy Suresh : గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. అయితే 2025లో విడుదలైన కొన్ని సినిమాల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు 2026ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యవాన్ సావిత్రి’పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఈరోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.  ‘సత్యవాన్ సావిత్రి’ 2026 జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఒక న్యాయవాది పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటివరకు పలు కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించిన ఆమె, ఈసారి కోర్ట్‌రూమ్ నేపథ్యంలో సాగే పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

ఈ చిత్రానికి ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. హార్ట్ బీట్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన చారుకేష్‌తో పాటు బాల శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, ఆర్. సుందరరాజన్, బ్రిగిడా, మాలా పార్వతి, ఎ. వెంకటేష్ తదితరులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదికకారన్‌పట్టి ఎస్. శక్తివేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ, తెలుగులో విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కీర్తి సురేష్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమాన వర్గం ఉండటంతో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కోర్ట్‌రూమ్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో, నిర్మాతలు త్వరలో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘సత్యవాన్ సావిత్రి’ మాత్రమే కాదు, 2026లో కీర్తి సురేష్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ‘రఫ్తార్’తో పాటు తమిళంలో ‘కన్నివేది’, తెలుగులో ‘రౌడీ జనార్దన’, మలయాళంలో ‘తోట్టం: ది డెమెస్నే’ చిత్రాల్లో కూడా ఆమె నటిస్తోంది. అంతేకాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో కీర్తి కథానాయికగా నటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్‌కు 2026 కీలకమైన సంవత్సరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన నిరాశలను వెనక్కి నెట్టి, బలమైన కథలు, విభిన్న పాత్రలతో మరోసారి తన నటనను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘సత్యవాన్ సావిత్రి’ విజయం సాధిస్తే, కీర్తి కెరీర్‌లో మరో కీలక మలుపుగా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.