Reading Time: < 1 minute

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి, 14 మంది పరిస్థితి విషమం

Caption of Image.

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్లీ జిల్లా జాట్ తాలూకాలోని మోటేవాడి గ్రామంలో ఉన్న ఓ ఆలయం దగ్గర మంగళవారం (మే 12) రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మార్గుబాయి దేవి యాత్ర సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు పలువురు భక్తులు ఆలయం వద్ద గుమిగూడారు.

ఇదే సమయంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో తలదాచుకున్నారు. భారీ వర్షం, ఈదురు గాలులతో ఆలయ గోడ కుప్పకూలింది. దీంతో ఆరుగురు మరణించగా.. పదుల సంఖ్యలో భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

క్షతగాత్రులను శిథిలాల కింది నుంచి వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు స్థానికులు కాగా, మిగిలిన ముగ్గురు బీజాపూర్ తాలూకాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  

ఈ ఘటనపై సాంగ్లీ జిల్లా ఎస్పీ తుషార్ దోషి మీడియాతో మాట్లాడారు. ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 350 మంది భక్తులు ఉన్నారని తెలిపారు. సాయంత్రం ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా బలమైన గాలులు, భారీ వర్షం కురవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని ఒక గోడ దగ్గర గుమిగూడి రేకుల కింద తలదాచుకున్నారని చెప్పారు. 

భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి గోడ, రేకులు అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు భక్తులు వాటిలో చిక్కుకుపోయారని తెలిపారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆరుగురు భక్తులు మరణించగా.. 14 మంది తీవ్రంగా గాయపడి ప్రాణలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. 
 

©️ VIL Media Pvt Ltd.