
Producing States in India: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకున్న అశాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ వంటి ‘హార్ముజ్ జలసంధి’ ఇంకా మూసి ఉండటంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే ముడిచమురు సరఫరాలో 20 శాతం వాటా ఈ హార్ముజ్ జలసంధిదే. ఈ మూసివేత నిర్ణయం కారణంగా భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. నిజానికి భారత్‌కు వచ్చే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం నుంచే రావాలి. మన దేశానికి చెందిన 40 శాతం క్రూడ్ ఆయిల్, 54 శాతం గ్యాస్ (LNG) దిగుమతులు ఈ జలసంధిపైనే ఆధారపడి ఉన్నాయి.
విదేశీ దిగుమతులు నిలిచిపోయిన తరుణంలో భారత్ తన సొంత చమురు నిల్వలపై దృష్టి సారించింది. ప్రస్తుతం దేశీయంగా అత్యధిక చమురును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఎడారి ప్రాంతంగా భావించే రాజస్థాన్.. నేడు దేశీయ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 20 నుంచి 25 శాతం వాటాను అందిస్తోంది. రాజస్థాన్‌లోని బార్మర్-సంచార్ బేసిన్ చమురు ఉత్పత్తికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ ఉన్న మంగళ, భాగ్యం, ఐశ్వర్య ఆయిల్ ఫీల్డ్స్ నుంచి భారీగా పెట్రోలియం లభ్యమవుతోంది. ‘కెర్న్ ఆయిల్ అండ్ గ్యాస్’ (వేదాంత) వంటి సంస్థలు అత్యాధునిక సాంకేతికతతో ఈ చమురును వెలికితీస్తున్నాయి. ఇక్కడ తీసిన చమురును 700 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ‘హీటెడ్ పైప్‌లైన్’ ద్వారా గుజరాత్‌లోని రిఫైనరీలకు తరలిస్తున్నారు.
భారత్‌లో చమురు ఉత్పత్తిలో టాప్-5 రాష్ట్రాలు..
భారత్‌లో చమురు ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని అంక్లేశ్వర్, కంబాత్, కలోల్, మెహసన ప్రాంతాల్లో ముడి చమురును సేకరిస్తున్నారు. అస్సాం విషయానికి వస్తే.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన చమురు ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి. అస్సాంలోని దిగ్బోయి ప్రాంతంలో 1889లోనే మొదటిసారి చమురును గుర్తించారు. ఈ ప్రాంతంలో అప్పటి నుంచే చమురు బావులు ఉన్నాయి. భారతదేశంలో తొలి చమురు ఉత్పత్తి కేంద్రం ఇదే కావడం విశేషం. అలాగే అస్సాంలోని నహర్ కటియా, మొరాన్ వంటి ప్రాంతాల్లో కూడా చమురు బావులు ఉన్నాయి. తమిళనాడులోని కావేరి బేసిన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చమురు క్షేత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్ తీర ప్రాంతాల్లో కూడా చమురు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక ఆఫ్‌షోర్ పద్ధతిలో చూసినట్లయితే, బాంబేకు అత్యంత సమీపంలోని అరేబియా సముద్రంలో ఉన్న ముంబై హై ప్రాంతంలో సముద్ర గర్భం నుంచి డ్రిల్లింగ్ ద్వారా చమురును సేకరిస్తున్నారు. ఇది ముంబై సముద్ర తీరం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇరాన్ – అమెరికా యుద్ధం కారణంగా చమురుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భారత్ దేశీయ అవసరాల కోసం రష్యా మొదలైన ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది.