ప్రాణం కంటే హెల్మెట్ బరువు ఎక్కువ కాదు..కానీ ఆ చిన్న హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించింది మెదక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అదే ‘నందగోకుల్’.ఆ ఊరి పొలిమేర దాటాలంటే తలకు హెల్మెట్ ఉండాల్సిందే..లేదంటే ‘నో ఎంట్రీ’ బోర్డు దర్శనమిస్తుంది. గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
వారం కిందట పోలీసు శాఖ గ్రామంలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించింది. మరుసటి రోజు సర్పంచి భానుప్రకాష్ రెడ్డి పాలకవర్గం,గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు..అందరి సమ్మతితో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని నిర్ణయించారు.ఈ విషయం పై గ్రామంలో దండోరా వేయించారు.
మూడు రోజుల క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు..గ్రామంలో సుమారు 1,100 మంది జనాభా ఉండగా, దాదాపు 250 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి..గతంలో కేవలం 50 మంది మాత్రమే హెల్మెట్ ధరించేవారు..రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిన గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి, గ్రామ సభలో ఒక వినూత్న తీర్మానం చేశారు.
హెల్మెట్ లేనిదే ఊర్లోకి ప్రవేశం లేదని,ఈ నిబంధన అతిక్రమిస్తే 500 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పై గ్రామంలో దండోరా వేయించి గ్రామంలోని అందరికీ అవగాహన కల్పించారు.
మా గ్రామంలో ఎవరూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం.దీనికి తోడు ఇతర గ్రామాల నుంచి,తమ గ్రామానికి వచ్చేవారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనీ నిర్ణయం తీసుకున్నారు.చట్టం కోసం కాదు,మన ప్రాణాల కోసం హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని నందగోకుల్ గ్రామస్తులు ప్రపంచానికి చాటుతున్నారు. ఇలానే అందరు హెల్మెట్ వాడితే చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.




