
రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరిగేలా ఉన్న వేళ.. తిరుమలలో మాత్రం చల్లని మేఘాల సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. కొండలను తాకుతూ సాగే పొగమంచు మేఘాలు వెంకటేశ్వరుడి పర్వతాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
వేసవి మధ్యలో శేషాచలం కొండల్లో కనిపిస్తున్న ఈ చల్లని వాతావరణం భక్తులను పరవశింపజేస్తోంది. పాలకడలి తరలివచ్చినట్టుగా పొగమంచు మేఘాలు కొండలపై కదులుతూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. మంచు తెరల మధ్య దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఘాట్ రోడ్లపై కమ్ముకున్న పొగమంచు తెరలు చూసేందుకు భక్తులు వాహనాలు ఆపి ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు తీసుకుంటూ ఆ క్షణాలను మధురంగా మలుచుకుంటున్నారు.
ఒకవైపు పచ్చని కొండలపై తేలియాడే మేఘాలు.. మరోవైపు లోయలపై పరుచుకున్న పొగమంచు.. ప్రకృతి సోయగాల కలయికగా ఈ దృశ్యం నిలుస్తోంది. తిరుమలలో కనిపిస్తున్న ఈ వాతావరణం భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులను కూడా మంత్ర ముగ్ధులను చేస్తోంది.