
- సినీ నటుడు మాదాల రవి
- రవీంద్రభారతిలో పీఎన్ఎం రాష్ట్ర మూడో మహాసభలు
రవీంద్రభారతి, వెలుగు: ప్రజలను చైతన్యపరచడంలో కళలదే కీలక పాత్ర అని, శరీరానికి వచ్చే జబ్బును డాక్టర్లు తగ్గిస్తే.. సమాజానికి పట్టిన అవినీతి, దోపిడీ అనే జబ్బులను కళాకారులే పోగొడతారని సినీ నటుడు, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ డాక్టర్ మాదాల రవి అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో ప్రజానాట్యమండలి (పీఎన్ఎం) రాష్ట్ర మూడో మహాసభలను సీనియర్ నేత నర్సయ్య ప్రారంభించగా, మాదాల రవి అధ్యక్ష ఉపన్యాసం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ‘మా భూమి’ నాటకం మట్టి మనుషులను పులులుగా మార్చిందని, ప్రస్తుతం డబ్బు ప్రభావం లేని రాజకీయాల కోసం కళాకారులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి ఎదగడానికి కమ్యూనిస్టు ఉద్యమమే కారణమని, విలువలున్న రాజకీయ నేతలు కరువైన నేటి తరుణంలో కమ్యూనిస్టులు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు. సామాజిక కార్యకర్త పీఏ దేవి, రైతు సంఘం నేత టి.సాగర్ మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదానికి కేంద్రం తలొగ్గుతున్నదని ఫైరయ్యారు. పత్తి, పాడి దిగుమతులపై సుంకాలు ఎత్తేయడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారన్నారు. పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నవ తెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్, పీఎన్ఎం కార్యదర్శి కట్ట నర్సింహ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.