
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచిన చిత్రం ‘కొండవీటి సింహం’. 1981లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అలాంటి ఇలాంటిది కాదు. కేవలం 53 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, అప్పట్లో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి సుమారు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. రోజా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అర్జున్ రాజు, ఎన్టీఆర్ డేట్స్ సాధించి, దర్శకుడు రాఘవేంద్రరావు నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘తంగ పథకం’ కథను ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్లుగా రచయిత సత్యానంద్ మార్పులు చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో పాత్ర మరణించేలా చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎన్టీఆర్ అంగీకరించడం ఈ చిత్రానికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో ఎన్టీఆర్ చూపిన రౌద్రం, గాంభీర్యం పోలీస్ పాత్రలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.
నటీనటుల ఎంపిక విషయంలోనూ ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా, కొడుకు పాత్ర కోసం మొదట చిరంజీవిని అనుకున్నారు. అప్పట్లో చిరంజీవి ఎదుగుతున్న నటుడిగా ఉండటం, అదే సమయంలో ‘చట్టానికి కళ్ళు లేవు’ సినిమాకు కమిట్ అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో నిర్మాతలే ఆయనను ఆ సినిమా వైపు వెళ్ళమని సూచించగా, ఆ స్థానంలోకి మోహన్ బాబు ప్రవేశించారు. దాసరి నారాయణరావు తన వద్ద ఉన్న మోహన్ బాబు డేట్స్‌ను సర్దుబాటు చేయడంతో కాస్టింగ్ పూర్తయింది. శ్రీదేవి, జయంతి హీరోయిన్లుగా నటించగా, చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది.
1981 అక్టోబర్ 7న విడుదలైన ‘కొండవీటి సింహం’ బాక్సాఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పింది. 65 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే స్టేట్ రికార్డ్ సృష్టించి, మొత్తం నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. 31 కేంద్రాల్లో 100 రోజులు, 14 కేంద్రాల్లో 175 రోజులు ఆడి తన సత్తా చాటింది. రాయలసీమలోని అన్ని విడుదల కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడిన ఈ రికార్డును పదేళ్ల తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ బ్రేక్ చేసింది. నైజాంలో ఐదు కేంద్రాల్లో సెంచరీ కొట్టిన తొలి సినిమాగా ఇది చరిత్ర సృష్టించగా, ఆ రికార్డును 11 ఏళ్ల తర్వాత ‘చంటి’ సమం చేసింది. మద్రాస్‌లో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవ వేడుకకు అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు పాల్గొన్న చివరి 100 రోజుల వేడుక ఇదే కావడం గమనార్హం.
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు