
- డీఆర్డీవోలకు పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 లక్షల పనిదినాలు నమోదవుతుండగా, వీటిని 8 లక్షలకు పెంచాలని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ బుధవారం డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతిజిల్లా నుంచి ఇద్దరు బెస్ట్ మేట్లను (ఎన్ఎంఎంఎస్ ద్వారా పక్కాగా హాజరు వేస్తున్న వారు) ఎంపిక చేసి పారితోషికం అందిస్తాన్నారు.
ఉపాధి హామీ పనుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. రోజుకు 8 లక్షల దినాలకు చేరుకునే వరకు ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పల్లెల్లో ఉపాధిహామీ పనుల తీరును నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.