Reading Time: 2 minutes
Virat Kohli Fitness Update Ipl 2026 Not 100 Percent Fit But Delivers In Rcb Win Vs Lsg

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకెళుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింట్లో విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొడుతూ.. రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తన ప్రదర్శనపై ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో తాను మెరుగ్గా ఆడినట్టు తెలిపిన కోహ్లీ.. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో మోకాలి నొప్పితో బాధపడ్డానని, అలాగే గత 4-5 రోజులుగా ఆరోగ్యం కూడా బాగోలేదని విరాట్ వెల్లడించాడు.

‘గత మ్యాచ్‌తో పోలిస్తే ఈరోజు చాలా బాగుంది. కానీ నేను ఇంకా 100 పర్సెంట్ ఫిట్‌గా లేను. గత మ్యాచ్‌లో నా మోకాలు కొంచెం నొప్పిగా ఉంది. అంతేకాదు గత 4-5 రోజులుగా ఆరోగ్యం కూడా బాలేదు. ఆర్‌సీబీ కోసమే బరిలోకి దిగా. ఇప్పుడు నా బెస్ట్‌కి చేరుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఈరోజు నేను మంచి ఆరంభం ఇచ్చాను. నా ఇంటెన్సిటీపై సంతోషంగా ఉన్నాను. అయితే మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లి ముగించాల్సింది అనిపించింది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. అందుకే అదే టెంపోలో ఆడాలని అనుకున్నాను. కానీ చివరికి మ్యాచ్‌ను ఫినిష్ చేయాల్సింది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

‘చిన్నస్వామి పిచ్ సాధారణంగా ఉండే దానికంటే నెమ్మదిగా ఉంది. పిచ్‌పై పచ్చిక కూడా ఎక్కువగా లేదు. గత 3-4 రోజులుగా తీవ్ర ఎండలు ఉండటంతో పిచ్ చాలా డ్రైగా మారింది. ఇది స్లో వికెట్‌గా మారుతుందనుకున్నాం. చిన్నస్వామిలో సాధారణంగా ఉండే పిచ్‌లా కాకుండా భిన్నంగా ఉంది. అందుకే మొదటి 5-6 ఓవర్లలోనే మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి దూరం చేయాలని ప్లాన్ చేసుకున్నాం. పవర్‌ప్లేలో బ్యాటింగ్ చాలా కీలకం. ఆ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాను. పాటిదార్ మంచి బ్యాటర్. పరిస్థితిని అంచనా వేసి ఆడుతాడు. మ్యాచ్ పరిస్థితిని కాకుండా బౌలర్ మనస్తత్వాన్ని అంచనా వేయమని అతడికి చెబుతా. అతనిలో మ్యాచ్ గురించి మంచి అవగాహన ఉంది’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.

‘మా మేనేజ్‌మెంట్ జట్టును బాగా నిర్మించింది. అందువల్ల మేము బాగా ఆడగలుగుతున్నాం. సాల్ట్‌తో కలిసి నేను మంచి ఆరంభం ఇవ్వగలుగుతున్నాను. ఆ తర్వాత రొమారియో, టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇంకా కేపీ (కృనాల్ పాండ్య) బ్యాటింగ్ చేయాల్సి కూడా రాలేదు. మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఐదు వికెట్లు పడిపోయినా.. ఈ ప్లేయర్స్ నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయగలరు. ఇది మాకు చాలా హెల్ప్ అవుతోంది. నా ఆట మ్యాచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మ్యాచ్‌లో 230-240 స్కోర్లు సాధ్యం కాదు. ఆధునిక క్రికెట్ మారుతోంది. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాలి. ఇది టోర్నమెంట్ మొదటి భాగం మాత్రమే. రెండో భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో తెలివిగా ఆడటం చాలా ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా మారగలిగిన జట్లు మాత్రమే ముందుకు వెళ్తాయి’ అని కింగ్ పేర్కొన్నాడు.