Reading Time: 2 minutes

భర్తను చంపేందుకు రూ. 5 లక్షల సుపారీ

Caption of Image.
  •  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణానికి పాల్పడిన భార్య
  • ములుగు జిల్లాలో దొరికిన డెడ్‌‌‌‌బాడీ

హనుమకొండ/పరకాల/ములుగు, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ రూ. 5 లక్షల సుపారి ఇచ్చి తన భర్తను హత్య చేయించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్, లావణ్య దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుమన్‌‌‌‌ స్థానికంగా మెకానిక్‌‌‌‌గా, లావణ్య పరకాలలో మున్సిపల్‌‌‌‌ కార్మికురాలిగా పని చేస్తోంది. లావణ్య అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఇదిలా ఉండగా.. సుమన్‌‌‌‌, లావణ్య కలిసి ఈ నెల 3న వరంగల్‌‌‌‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. 4వ తేదీ నుంచి సుమన్‌‌‌‌ కనిపించకుండా పోయాడు. దీంతో లావణ్య తన భర్త కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆరో తేదీన లావణ్య పరకాలలోని తన ఇంటికి చేరుకోగా.. సుమన్‌‌‌‌ తల్లిదండ్రులు అతడి గురించి ఆరా తీశారు. ఆచూకీ దొరకలేదని ఆమె చెప్పడంతో సుమన్‌‌‌‌ తండ్రి సాంబయ్య 8వ తేదీన పరకాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌‌‌‌ కేసు నమోదు చేసి, ప్రత్యేక టీమ్స్‌‌‌‌తో విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో సుమన్‌‌‌‌ సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ చివరి సిగ్నల్‌‌‌‌ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చూపించింది. దీంతో పరకాల, పస్రా పోలీసులు సంయుక్తంగా ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొందరు వ్యక్తులు సుమన్‌‌‌‌ను వరంగల్‌‌‌‌ నుంచి తీసుకెళ్లి గోవిందరావుపేట శివారులో మద్యం తాగించిన అనంతరం బీర్‌‌‌‌ సీసాలతో పొడిచి హత్య చేశారని, డెడ్‌‌‌‌బాడీని గుర్తు పట్టకుండా పెట్రోల్‌‌‌‌పోసి కాల్చినట్లు గుర్తించారు. కాగా, లావణ్యకు తనతో కలిసి పని చేసే మరో మహిళ సాయంతో గోవిందరావుపేటకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా.. ఆయనతోనే సుమన్‌‌‌‌ ను చంపించినట్లు తెలుస్తోంది.

ఇందుకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. సుమన్‌‌‌‌ను హతమార్చేందుకు లావణ్య గతంలోనే రెండు సార్లు ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో సుపారీ ఇచ్చి అతడిని మర్డర్‌‌‌‌ చేయించని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్యతో పాటు సుపారీ తీసుకుని సుమన్‌‌‌‌ను హత్య చేసిన గోవిందరావుపేటకు చెందిన వ్యక్తిని పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమన్‌‌‌‌ హత్య విషయం మృతుడి కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం రాత్రి పరకాల పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. హత్య చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

©️ VIL Media Pvt Ltd.