Reading Time: < 1 minute

దిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తం: అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్

Caption of Image.

టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే పూర్తిగా స్తంభింపజేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇరాన్ సంయుక్త సైనిక దళాల కమాండర్ అలీ అబ్దుల్లాహి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది.

ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన బ్లాకేడ్ ఎత్తివేయకపోతే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిరోధిస్తామని హెచ్చరించారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుని విషయంలో ఇరాన్ రాజీ పడబోదని స్పష్టం చేశారు. అమెరికా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ఇరుదేశాల మధ్య కుదిరిన తాత్కలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. 

హార్మూజ్‎ను దిగ్బంధించిన అమెరికా

పశ్చిమాసియా యుద్ధం ముగించడమే లక్ష్యంగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాద్‎లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బ్లాకేడ్ చేస్తామని ప్రకటించారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నేవీ దళాలు హార్మూజ్ జలసంధిని దిగ్భంధనం చేశాయి. ఇరాన్కు చెందిన ఓడరేవులను అమెరికా నేవీ బలగాలు చుట్టుముట్టాయి. అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధిలో భారీగా బలగాలను మోహరించింది. 

హార్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. హార్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగించాలంటే ఏ దేశమైనా సరే తమ అనుమతి తీసుకోవాలని అమెరికా ఫోర్సెస్ తేల్చి చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దళాలు మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హార్మూజ్ జలసంధి దగ్గర గంభీర వాతావరణం అవరించింది. ఈ క్రమంలో తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికలపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ. 

©️ VIL Media Pvt Ltd.