Reading Time: 2 minutes

‘నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు’.. కన్నీటిపర్యంతమైన సింగర్ మంగ్లీ!

Caption of Image.

జానపద గీతాలతో గుర్తింపును సొంతం చేసుకున్న గాయని మంగ్లీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. సుమారు రూ. 10 కోట్ల మెక్రో ఫైనాన్స్ మోసం కేసులో ఆమె పేరు తెరపైకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలుపై  బుధవారం (  ఏప్రిల్ 15న )  తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చిన మంగ్లీ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

డీజీపీకి ఫిర్యాదు

తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్న మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై మంగ్లీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సంబంధం లేని విషయాల్లో తన ఫోటోలు వాడుతూ, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజులుగా నా ప్రోగ్రామ్స్ ను వదులుకున్నా.. ప్రజల్లోకి తన గురించి తప్పుగా వెళ్తోంది. బాధితులకు అండగా ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మంగ్లీ తెలిపారు. నాపై దుష్ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కొరినట్లు చెప్పారు.

 జైలుకైనా సిద్ధం..

నేను పేదరికం నుంచి వచ్చినదాన్నే. కష్టం అంటే ఏంటో, డబ్బు విలువ ఏంటో నాకు తెలుసు. నాకు పాటల ప్రపంచం తప్ప స్కామ్‌ల గురించి ఏమీ తెలియదు అంటూ మంగ్లీ భావోద్వేగానికి గురయ్యారు.. గత 30 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న కామెంట్లు చూసి .. మానసికంగా ఎంతో నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. తన పేరు వాడుకుని కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అసలేం జరిగింది?

న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు,  రమావత్‌ మధు, బాలాజీనాయక్‌, భరత్‌ చౌహాన్‌పై కేసు నమోదు చేశారు. ‘సుభాక్షేత్ర బిజినెస్’ అనే సంస్థ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. మెక్రో ఫైనాన్స్ పేరిట రూ. 10 కోట్ల మేర మోసం చేశారని , ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

అయితే, మంగ్లీ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ స్కామ్‌లో అసలు నిందితులే బాధితుల ముసుగులో మీడియా ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఎండీగా ఉన్న మధు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హిమకాంత్ రెడ్డిలే బాధ్యులని, వారితో మంగ్లీకి ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.