
19 ఏళ్ల వయసులో 180 మంది బాలికలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించిన మహారాష్ట్ర యువకుడు మహ్మద్ అయాజ్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. అమ్మాయిలను ట్రాప్ చేసి అనుభవిస్తూ.. వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన అయాజ్ ఇంటి మీదకు బుల్డోజర్లు వెళ్లాయి. ఈ సమయంలో ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇంటిని కూల్చేశారు.
#WATCH | Maharashtra | Amravati District Administration, in the presence of police, conducts bulldozer action against the illegal construction at the property of the primary accused in the minor girls’ abuse and blackmail case in Paratwada pic.twitter.com/xiLyu1FstT
— ANI (@ANI) April 15, 2026
మహారాష్ట్రలోని అమరావతి పరిధిలోని పరాట్వాడా పట్టణానికి చెందిన అయాజ్ లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. 180 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించడమే కాకుండా.. 350 వీడియోలను రహస్యంగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వాట్సాప్, స్నాప్ చాట్ గ్రూపులను వాడుకుని అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు. టీనేజ్ అమ్మాయిలే టార్గెట్గా ఈ 19 ఏళ్ల యువకుడి ఉన్మాద చర్యలు కొనసాగాయి. అమ్మాయిలను ట్రాప్ చేసి ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లేవాడు.
అక్కడ సిటీ తిప్పి చూపించి హోటల్ గదికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఆ అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలు చూపించి వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా తను పిలిచినప్పుడు వచ్చి తన కోరిక తీర్చాలని అయాజ్ డిమాండ్ చేశాడు. అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకునే వాడు. ఇళ్లలో తెలిస్తే పరువు పోతుందని అయాజ్ గురించి బాధిత టీనేజ్ అమ్మాయిలు ఎవరికీ చెప్పలేదు. మహ్మద్ అయాజ్ చేసిన గలీజ్ దందా ఇది. కొందరు అమ్మాయిలతో అయాజ్ ఉన్న వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో బీజేపీ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగ లాగడంతో అయాజ్ డొంకంతా కదిలింది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అధికారులు అతని ఇంటిని జేసీబీలతో కూల్చేయడం గమనార్హం. పరాట్వాడా పట్టణంలోని అచల్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో అయాజ్ ఇల్లు కూల్చేశారు. అక్రమ నిర్మాణంగా తేలడంతో ఇంటిని కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. పై అంతస్తుకు వెళ్లేందుకు ఇంటి బయట నిర్మించిన ఇనుప మెట్లను ఒక జేసీబీ యంత్రం కూల్చివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ కావడం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణం గురించి నిందితుడి కుటుంబానికి నోటీసు జారీ చేసిన తర్వాతనే కూల్చివేతలు మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. తన్వీర్ అని కూడా పిలువబడే అయాజ్‌పై లైంగిక దాడి, వేధింపులు, అశ్లీల వీడియోలు రికార్డ్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
19 ఏళ్ల ఇతను సోషల్ మీడియా వేదికల ద్వారా మైనర్ బాలికలను ప్రలోభపెట్టి, వారిని మానసికంగా బంధించి, ఆ తర్వాత వారిని లైంగికంగా దోపిడీ చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ లైంగిక వేధింపుల కేసులో.. పోలీసులు ఇప్పటివరకు అయాజ్, అతని ఫ్రెండ్ ఉజర్ ఖాన్‌తో సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయాజ్‌ను కోర్టులో హాజరుపరచగా, అతనికి ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించారు.