Reading Time: 2 minutes

ఒక్క సినిమా టైటిట్ కోసం రూ. 112 కోట్లు డిమాండా? విఘ్నేశ్ శివన్ చెప్పిన షాకింగ్ నిజాలు!

Caption of Image.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూవీస్ టైటిల్స్ విషయంలో వివాదాలు రావడం కొత్తేమీ కాదు. కానీ, ఒక టైటిల్ కోసం ఏకంగా రూ. 112 కోట్లు డిమాండ్ చేశారంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ ఎదుర్కొన్న చేదు అనుభవం. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ గా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) విషయంలో జరిగిన ఈ ఆసక్తికర డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగింది?

ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు విఘ్నేశ్ శివన్ ‘LIC’ (Love Insurance Company) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే, ప్రముఖ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రంగంలోకి దిగింది. తమ సంస్థ పేరును పోలి ఉన్న టైటిల్‌ను వాడకూడదని, ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని లీగల్ నోటీసులు పంపిందని లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో విఘ్నేశ్ వెల్లడించారు.  మేము ఆ టైటిల్ వాడతామని అడిగినప్పుడు, ఆ సంస్థ మా నుండి ఏకంగా రూ. 112 కోట్లు డిమాండ్ చేసింది. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాను అని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

‘C’ పోయి ‘K’ వచ్చింది!

రూ. 112 కోట్లు కట్టలేక.. తన దగ్గర ఉన్న ఇతర ఆప్షన్లను పరిశీలించినట్లు విఘ్నేశ్ శివన్ తెలిపారు.  అలా LIP, LIT, LIF వంటి టైటిల్స్ అనుకున్నా.. చివరకు ‘LIK’ (Love Insurance Kompany) అనే పేరును ఫైనల్ చేశామని చెప్పుకొచ్చారు.. ఇక్కడ ‘Company’ స్పెల్లింగ్‌ను ‘Kompany’గా మార్చి, దానికొక విభిన్నమైన స్టైలింగ్‌ను జోడించినట్లు తెలిపారు. ఈ మార్పు చట్టపరమైన సమస్యల నుంచి తమను కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు.

 

బాక్సాఫీస్ వద్ద నిరాశ..

భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. 2040 నాటి ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా, టెక్నాలజీ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం యువతను ఆకట్టుకోవడంలో తడబడింది. ఫోన్ యాప్‌ల ఆధారంగా ప్రేమను వెతికే అమ్మాయికి, మనసుతో ప్రేమించే అబ్బాయికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 39 కోట్లు వసూలు చేసినా, బడ్జెట్ పరంగా చూస్తే సినిమా ఆశించిన స్థాయి హిట్ అందుకోలేకపోయింది.

హ్యాట్రిక్ మిస్

‘లవ్ టుడే’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ కొడతారని ఆశించిన ఫ్యాన్స్‌కు ఈ సినిమా నిరాశే మిగిల్చింది. ఏదిఏమైనా సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా.. టైటిల్ కోసం రూ. 112 కోట్ల డిమాండ్ రావడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. విఘ్నేశ్ తెలివిగా ‘K’ అనే అక్షరంతో గండం గట్టెక్కినా, బాక్సాఫీస్ గండాన్ని మాత్రం దాటలేకపోయారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

 

©️ VIL Media Pvt Ltd.