Reading Time: 2 minutes
Tollywood Theatre Strike May 1 Exhibitors Vs Producers Revenue Sharing

తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విధంగా ఒక వివాదం తెర మీదకు వచ్చింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య మొదలైన ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే వచ్చే నెల మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేసి, నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గురించి చెబుతున్నారు. ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం తమను నష్టాల్లోకి నెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతమున్న రెంటల్ పద్ధతి కాకుండా, కలెక్షన్లలో తమకు సరైన వాటా దక్కేలా రెవెన్యూ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?

అయితే, ఈ ప్రతిపాదనను ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్మాణ వ్యయం ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోందని, ఇలాంటి సమయంలో రెవెన్యూ షేరింగ్ మోడల్ వల్ల నిర్మాతలు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. ఈ ఇరు వర్గాల మొండివైఖరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1 నుంచి థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ థియేటర్ల సమ్మె నిజంగానే జరిగితే, సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకుందామని భావిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చాక పోయినా నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ స్వయంభూ మే నెల మీదే కన్నేయడంతో దానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. టైటిల్‌తో ఆసక్తి రేపుతున్న కొరియన్ కనకరాజు సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సూర్య కరుప్పు కూడా మే నెల రేసులోనే ఉంది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని చిన్న, మధ్య తరహా చిత్రాలు కూడా మే నెలలో విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి. మే నెలలో వరుస సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని ఆశించిన నిర్మాతలకు ఈ సమ్మె వార్త ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.