
ఇరాన్ అమెరికా చర్చలు విఫలం కావడంతో అనిశ్చితి మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని బంధించకుండా అలాగే అణునిల్వలు, అణ్వాయుధ తయారీ వంటి అంతర్జాతీయ సమస్యలను ఈ ఒప్పందంలో ఇమడ్చకుండా మిగతా అంశాలపై చర్చలు సాగితేనే చిక్కులు వీడతాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. 197679 మధ్యకాలంలో అమెరికా మద్దతుతో షా పాలన బలంగా ఉన్నట్టు కనిపించినా, ప్రజల్లోని అసంతృప్తి 1979 లో అమెరికా మద్దతు గల ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది. అప్పటినుంచి ఇరాన్‌కు అమెరికాకు మధ్య సన్నిహిత సంబంధాలు కానీ, చర్చలు కానీ జరగలేదు. మళ్లీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడం చారిత్రాత్మకమైన సంఘటన. మొదటిసారి ఈ రెండు దేశాల ముఖాముఖి ప్రత్యక్ష చర్చలు బెడిసికొట్టడం దుష్పరిణామానికి సంకేతమే.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అణ్వస్త్ర తయారీతోసహా అమెరికా షరతులేవీ ఇరాన్ ఒప్పుకోవడం లేదనీ విలేకరులకు వెల్లడించారు. ఒక్క సమావేశం తోనే ఒప్పందం ఎలా కుదురుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ విస్మయం ప్రకటిస్తోంది. అమెరికావి సాధ్యం కాని గొంతెమ్మ కోరికలని ఇరాన్ ప్రభుత్వ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. ఇరుదేశాలు యుద్ధ విరమణకు తాత్కాలికంగా నిర్ణయించడంతో కొన్నిరోజుల పాటు ఆర్థిక మార్కెట్లు పుంజుకోవడం కనిపించింది. ఇప్పుడు మళ్లీ అకస్మాత్తుగా పరిస్థితి సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఏర్పడింది. హర్ముజ్ జలసంధిని ముట్టడించడం, నౌకారవాణాను అడ్డుకోవడం ప్రధాన సంక్షోభం అయినప్పటికీ దాన్ని నివారించకుండా కొనసాగితే ఇది ఎప్పుడు పరిష్కారమవుతుందో ఏ దేశం చెప్పలేకపోతోంది. అయితే ఇటు ఇరాన్, అటు అమెరికా ఈ రెండూ చర్చలు ముగిసిపోలేదన్న సంకేతాలు అందించడం ఆశలు చిగురిస్తున్నాయి. ఒప్పందం కుదర్చడంలో వాన్స్ వైఫల్యం చర్చలు ముగిసిపోయినట్టు కాదని ఇరాన్ అభిప్రాయపడుతోంది.
రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. అయితే మళ్లీ చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టం చేయలేదు. రెండు దేశాలు చర్చలు సాగించడం తప్పనిసరి. అణుసంబంధిత అంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఇతర అంశాల నుండి వేరు చేసి సుదీర్ఘకాలం నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వినబడుతోంది. అలాగే లెబనాన్‌పై బాంబు దాడులు కొనసాగించకుండా ఇజ్రాయెల్‌ను అమెరికా కట్టడిచేయడం తక్షణ అవసరం. బాంబు దాడులవల్ల హెజ్బొల్లా వర్గాలతో సంబంధం లేని అమాయక ప్రజలు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. హర్మూజ్ జలసంధిని తన అధీనంలో బంధించకుండా, అలాగే రవాణా నౌకలపై టోల్ రుసుం విధించకుండా స్వేచ్ఛగా రవాణా జరిగేలా ఇరాన్ చొరవ చూపవలసిన అవసరం ఉంది. జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణంకోసం కొన్ని నౌకలు ఇరాన్ అధికారులకు దాదాపు 2 మిలియన్ డాలర్లు (దాదాపు 16 నుంచి 17 కోట్ల రూపాయలు) చెల్లించినట్టు సమాచారం.
ఇదే విధంగా ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలతో సంబంధం లేని నౌకల రవాణాకు భద్రత కల్పించడానికి నెలవారీ 180 మిలియన్ డాలర్లు చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయి. 1982 లో ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒప్పందాన్ని రూపొందించగా, ఇరాన్‌తో సహా 168 దేశాలు ఆమోదించాయి. అయితే ఇరాన్ ఆమోదించినప్పటికీ చట్టబద్ధంగా అమలులోకి తీసుకు రాలేదు. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ మహా సముద్రాలు, వాటి వనరులపై ఆయా దేశాల హక్కులు, బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఇరాన్ కానీ, అమెరికా కానీ ముట్టడిస్తే ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఈ జలసంధిని మూసేయడం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం ఉండదని, ఈ జలసంధి ద్వారా అమెరికా సముద్ర వాణిజ్యం చాలా స్వల్పమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కానీ జలసంధి ముట్టడి వల్ల చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ 50% కన్నా ఎక్కువ శాతం ఇంధనాన్ని ఈ జలసంధిద్వారా దిగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాదు అమెరికా మిత్రదేశాలు సౌదీఅరేబియా, కువాయిట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి కూడా చమురు ఎగుమతులకు ఆటంకం ఏర్పడుతుంది. ఇంతటి సంక్షోభాన్ని కూడా తమ దేశానికి లాభం తెచ్చే అవకాశంగా ట్రంప్ వినియోగించుకోవడం విచిత్రం. మా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మా దేశానికి వచ్చి చమురును కొనుక్కుని వెళ్లండని ట్రంప్ పిలుపునిస్తున్నారు. సముద్రంలో మందుపాతరలు అమర్చి అంతర్జాతీయ వాణిజ్యానికి దారిఇవ్వకుండా ప్రపంచ దేశాలను ఇరాన్ దోపిడీ చేస్తోందని ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ బెదిరింపులకు అమెరికా లొంగిపోదని హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌కు అనవసరంగా, అక్రమంగా టోల్ చెల్లించే ప్రతినౌకను క్షుణ్ణంగా తనిఖీ చేసి అడ్డగించాలని తన నావికా దళాన్ని ఆదేశించానని, అలా టోల్ చెల్లించే నౌకలకు దేనికీ నడిసముద్రంలో సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉండదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తోందో, ఇతర దేశాలతో దాని సంబంధాలు ఎలా మారుతున్నాయో సూచిస్తున్నాయి.