Reading Time: 2 minutes

హైదరాబాద్: ఆర్ టిసి కార్మికులను సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాను కోరుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో పొన్నం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్ టిసి ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని తెలియజేశారు. ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి  తాను సిద్ధంగా ఉన్నానని, ఉద్యోగుల సమస్యలు వినేందుకు మా తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని వివరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డిఎ అమలులోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డిఎ బకాయిలు లేవని తెలియజేస్తున్నానని, ఆర్ టిసి ఉద్యోగులకు పిఆర్ సి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

ఆర్ టిసి ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని, ఎన్నికల షెడ్యూల్‌కు ముందు హడావిడిగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని, ఈ విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని, కమిటీ ఏర్పాటయ్యాక కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంని, అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఆ తరువాత లోకసభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా కోడ్ అమలులో ఉండటం వల్ల ఈ అంశంపై సమగ్రంగా ముందుకు వెళ్లడం ఆలస్యమైందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని, ఆర్ టిసి సేవలను బలోపేతం చేశామని పొన్నం పేర్కొన్నారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్ టిసిని,  ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని, ఆర్ టిసి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం, ఈ మూడు అంశాలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని తాను భావిస్తున్నానని పొన్నం చెప్పారు. 

ప్రస్తుతం ఆర్ టిసి క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని తాను భావిస్తున్నానని, ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని, మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్ టిసికి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, అలాగే రూ.690 కోట్లుగా ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని, ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని, కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేశామని, త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని పొన్నం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్ టిసి ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.