
అమెరికా- ఇరాన్ చర్చలు పట్టాలు తప్పడం మొత్తం ప్రపంచాన్ని నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రమేయం కారణంగా ప్రపంచం ఈ చర్చలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమెరికాకు కాబోయ్ అధ్యక్షునిగా ప్రచారం పొందుతున్న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇరాన్‌ను చర్చల బల్ల వద్దకు తీసుకురావడం వాన్స్‌కు అప్పగించిన అత్యంత కీలకమైన బాధ్యత కావడం గమనార్హం. ఈ చర్చలు సఫలమైతే మొత్తం ప్రపంచం ఒక పక్క యుద్ధ జ్వాలలు చల్లారతాయని, మరోవంక అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతకు మార్గం ఏర్పడుతుందని ఆశతో ఎదురు చూసింది. ఈ చర్చలద్వారా తన దౌత్య నైపుణ్యతను ప్రదర్శించి ఓ కీలకమైన అంతర్జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందేందుకు వాన్స్ సైతం ఎంతో ఆత్రుత చెందారని చెబుతున్నారు. అందుకనే ఆయన ఇరాన్ ప్రతినిధులతో సామరస్యంగా వారిలో ఓ విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నిస్తూ స్నేహపూర్వక హస్తం అందించేందుకు సిద్ధమయ్యారని కూడా తెలుస్తుంది.
అయితే, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా ఇరాన్‌ల మధ్య 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు, ఇరుపక్షాలు ఒకరి డిమాండ్లకు మరొకరు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమవడం విస్మయం కలిగిస్తోంది. ఇరాన్‌అమెరికాల మధ్య ఉన్న ‘అవిశ్వాసం, అపార్థాల ప్రమాదం’ గురించి తెలిసినప్పటికీ, టెహ్రాన్ సంధానకర్తలతో ‘సత్సంబంధాలు పెంచుకుని, మరింత స్నేహపూర్వకంగా’ మారారని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించి, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, చివరికి వాన్స్ బృందం ఇరాన్‌తో ‘చాలా స్నేహపూర్వకంగా’ మారిందని చెప్పారు. అయితే, తన ‘అణు ఆశయాలను’ వదులుకోవడానికి ఇరాన్ నిరాకరించడమే చివరికి చర్చల వైఫల్యానికి దారితీసిందని ఇప్పుడు చెబుతున్నారు. ‘మేము చాలా తీవ్రమైన చర్చలు జరిపాము, చివరికి అవి చాలా స్నేహపూర్వకంగా మారాయి. వారు తమ అణు ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించడం మినహా, మాకు అవసరమైన దాదాపు అన్ని అంశాలనూ మేము సాధించాము.
నిజం చెప్పాలంటే, నా దృష్టిలో, అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన అంశం అదే’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. 21 గంటల పాటు జరిగిన రహస్య చర్చల వివరాలను వెల్లడించడానికి వాన్స్ నిరాకరించినప్పటికీ, ప్రధాన విభేదం అణ్వాయుధాల అంశంపైనేనని చెబుతున్నారు. ఇరాన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని అంటూనే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని వాన్స్ తెలపడం గమనార్హం. ఇరాన్ మాత్రం తాము అణుబాంబు తయారీ ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేస్తున్నా తమకు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదనే స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టడం గమనిస్తుంటే ఇరాన్ చెప్పినట్లు యుద్ధం ద్వారా సాధింపలేని అంశాలను చర్చల ద్వారా సాధించాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది. కాగా, ఇరాన్ అమెరికా చర్చలలో పురోగతి లేకపోవటానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కారణమని ఇరాన్ ఆరోపించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంటున్నది.
చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌కు ఫోన్ చేశారని, ఆ తర్వాత చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఆరోపించారు. చర్చల మధ్యలో జెడి వాన్స్‌కు, నెతన్యాహూ ఫోన్ చేశారని, ఆ తర్వాత కీలక పురోగతి దిశగా వెళ్తున్న చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులు ప్రారంభించడానికి సైతం ఇజ్రాయెల్ ఒత్తిడియే కారణమని అమెరికా నిఘా విభాగంలో కీలక వ్యక్తులు సైతం ఇంతకు ముందు ఆరోపించడం గమనార్హం. ముందు రోజు వరకు యుఎఇలో రెండు దేశాల మధ్య జరిగిన చర్చలలో దాదాపుగా ఓ అంగీకారంకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అణ్వాయుధాల విషయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ దిగివచ్చి అనేక షరతులకు అంగీకరించినట్లు స్వయంగా యుఎఇ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యాయి.
కేవలం ఐక్యరాజ్యసమితి నిపుణులు మాత్రమే కాకుండా, అమెరికా నిపుణులు సైతం ఇరాన్‌లో అణు కేంద్రాల తనిఖీకి అంగీకారం కుదిరిందని కూడా చెప్పారు. అంతగా ఇరాన్ దిగివచ్చిన యుద్ధం ప్రారంభించారంటే యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు ఏవీ వాస్తవం కాదని స్పష్టం అవుతుంది. ఇరాన్‌కు అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులు జరిపే ఉద్దేశం లేదని, ఇప్పుడు ఆ దేశంపై యుద్ధంకు వెళ్లాల్సిన అవసరం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని స్వయంగా అమెరికా నిఘా విభాగంలో కీలక వ్యక్తులు చెప్పడం గమనిస్తే కేవలం ఇజ్రాయెల్‌పై ఒత్తిడితో, ఆ దేశం ప్రధానిని సంతృప్తి పరచేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడి అవుతుంది. అయితే, యుద్ధం లో ఇరాన్‌లోని అగ్రనాయకత్వం మొత్తాన్ని దాదాపుగా హతమొనర్చిన్నప్పటికీ అక్కడి సైన్యం ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తీవ్రమైన ప్రతిఘటన ఇస్తూ ఉండటం, పైగా యుద్ధ పరిధిని అటు గల్ఫ్ దేశాలకు, ఇటు హర్మూజ్ జలసంధికి విస్తరింపచేయడంతో అమెరికా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
ఇరాన్ దూకుడును తట్టుకొనేందుకు అదనపు దళాలను మోహరింప చేయాల్సి వచ్చింది. ఊహించని రీతిలో భారీగా వ్యయం భరించాల్సి వస్తుంది. ఇరాన్ శక్తిసామర్ధ్యాలను అంచనా వేయకుండానే అమెరికా తొందరపాటుతో యుద్ధంకు ఉపక్రమించినట్లు ఇప్పుడు సర్వత్రా భావిస్తున్నారు. అందుచేత ఈ యుద్ధం నుండి గౌరవంగా బయటపడాలని ట్రంప్ మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఓ వారధిగా కనిపించింది. పాకిస్తాన్‌ను చైనా నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతున్నా అమెరికా కనుసన్నల్లోనే ఆ దేశం ఇరాన్‌తో సయోధ్యకు సంప్రదింపులు ప్రారంభిన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ కూడా గౌరవంగా ఈ యుద్ధం నుండి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. అందుచేతే ఇరువురూ చర్చలపట్ల ఆసక్తి చూపారు. వారి మధ్య ఎక్కడ ఒప్పందం కుదురుతుందో అని కేవలం ఇజ్రాయెల్ మాత్రమే అలజడికి గురైనట్లు తర్వాత పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు చర్చల మధ్యలో జెడి వాన్స్‌కు, ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ చేశారనే వార్తలపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. జెడి వాన్స్‌కు నెతన్యాహు ఫోన్ కాల్ తర్వాత అమెరికా – ఇరాన్ చర్చల దృష్టి మొత్తం ఇజ్రాయెల్ ప్రయోజనాలవైపు మళ్లిందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించడం, నెతన్యాహు ఒత్తిడి మేరకే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధానికి దిగారని ఇంతకు ముందు అమెరికా నిభా విభాగం అధికారులు పేర్కొనడం చూస్తుంటే నెతన్యాహు అభీష్టంకు వ్యతిరేకంగా అడుగులు వేయలేని నిస్సహాయ స్థితిలో ట్రంప్ ఉన్నారా? అనే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అందించిన సహకారం మాత్రమే అందుకు కారణం కాకపోవచ్చని కూడా ఈ సందర్భంగా భావిస్తున్నారు. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్నప్పటికీ గల్ఫ్‌లో భారత్ వాణిజ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు విశేషంగా ముడివడి ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియా ఘర్షణలో జోక్యం చేసుకోలేకపోవడం సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.
యుద్ధం మొదటి రోజునే చెప్పిన మాటలు ప్రకారం, ఇరాన్ లో ప్రభుత్వం మారితే, అంటే తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడకుండా యుద్ధం ముగిసిపోతే తమ దేశం భద్రత, ఎత్తుగడలకు పెద్ద ముప్పు ఏర్పడగలదని ఇజ్రాయెల్ భయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇరాన్‌ను ఇప్పుడు లొంగదీసుకోకపోతే సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని అమెరికా సైతం గ్రహించింది. అమెరికాకు మాదకద్రవ్యాల సరఫరా నెపంతో వెనిజులాపై దాడి చేసి ఆ దేశం అధ్యక్షుడు నికోలస్ మదురో మోరో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌లను అపహరించి తమ దేశంలోని జైలులో నిర్బంధించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి మాట్లాడటంలేదు. వందలాది మంది అమెరికా కంపెనీల ప్రతినిధులను ఆ దేశం పంపుతూ, ఆ దేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఇరాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు కంపెనీలలో అమెరికా కంపెనీలకు భాగస్వామ్యంకు అనుమతిస్తే ఇరాన్ చేపట్టే అణు కార్యక్రమంతోపాటు హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం వంటి అంశాలకు అమెరికా అంతగా పట్టుపట్టకపోవచ్చని చెప్పవచ్చు. అవసరమైతే జలసంధి వద్ద టోల్ ఫీజు వసూలులో కొంత వాటా కోరవచ్చు. గల్ఫ్ దేశాలలో సైతం ఆ దేశాల భద్రతా అంశాలపై కన్నా తమ పెట్టుబడుల భద్రతపై అమెరికా ఆందోళనగా ఉంది.
– చలసాని నరేంద్ర
98495 69050