Reading Time: < 1 minute
Delhi Rain Storm Thunder Heavy Rain Traffic Disruptions

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లింది. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఢిల్లీలో ఆకాశం మేఘావృతం అయి ఉంది. దీంతో బుధవారం ఉదయం, సాయంత్రం సమయాల్లో ఢిల్లీ ప్రాంతమంతటా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో నగరమంతా గందరగోళంగా మారింది.

బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ధూళి తుఫాను ముంచెత్తింది. ఓ వైపు మెరుపులు, ఇంకో వైపు భారీ వర్షం. బలమైన గాలులు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే విమాన రాకపోకలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఇక మెరుపులు సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాలకు, కిటికీలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో దేశమంతటా విభిన్న వాతావరణం కొనసాగవచ్చని.. దీని కారణంగా పలు ప్రాంతాల్లో అడపాదడపా భారీ వర్షాలు, ఈదురు గాలులు, స్థానిక అంతరాయాలు ఏర్పడవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ధూళి తుఫానులు, ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావం చూపునున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపునుందని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Modi-Sonia Gandhi: ఒకే ఫ్రేమ్‌లో మోడీ-సోనియాగాంధీ.. ఫొటో వైరల్