ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో ప్రీతిక డబుల్ ధమాక

మాడ్రిడ్: ఇండియా యంగ్ ఆర్చర్ ప్రీతిక ప్రదీప్.. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో డబుల్ మెడల్స్‌తో మెరిసింది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నం–ప్రీతిక ప్రదీప్–చికితా తానిపర్తిలతో కూడిన ఇండియా త్రయం 228–232 స్కోరుతో కొలంబియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. తర్వాత జరిగిన వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ప్రీతిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ప్రీతిక 145–-142 స్కోరుతో వరల్డ్ 11వ ర్యాంకర్ హజాల్ బురున్ (టర్కీ)కు షాకిచ్చింది.
అంతకుముందు టీమ్ విభాగంలో 17 ఏళ్ల ప్రీతిక ఆరుసార్లు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించినా.. సీనియర్ ఆర్చర్ జ్యోతి సురేఖ ఫామ్ కోల్పోవడం జట్టు లయను దెబ్బతీసింది. ఆమె వేసిన 8 బాణాల్లో కేవలం మూడు మాత్రమే 10 పాయింట్ల లక్ష్యాన్ని చేరాయి. కొలంబియా ఆర్చర్ ఉస్కియానో వరుసగా 8 పర్ఫెక్ట్ 10 స్కోరు చేసింది.
తొలి రౌండ్ నుంచే జోరు చూపెట్టిన కొలంబియా 57 పాయింట్లు సాధించగా, ఇండియా 55 పాయింట్లకే పరిమితమైంది. రెండో రౌండ్‌లో కొలంబియా 60/60 స్కోరు చేసి ఆధిక్యాన్ని 117–113కు పెంచుకుంది. థర్డ్ రౌండ్‌లో ఇండియా వరుసగా ఐదుసార్లు 10/10 పాయింట్లు సాధించి తేడాను 172–174కు తగ్గించింది. కానీ నిర్ణయాత్మక ఆఖరి రౌండ్‌లో ఒత్తిడికి లోనైన ఇండియా త్రయం 56 పాయింట్లే చేయగా.. కొలంబియా 58 పాయింట్లు సాధించింది.