Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఇటీవల ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా వైట్ వాష్‌ను ఎదుర్కొంది. శనివారం జరిగిన ఐదో టీ20లో కూడా భారత్ 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 4-0తో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. భారత్ బౌలింగ్‌లో పెద్దగా పసలేదన్నాడు. ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. జట్టు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిందని, ఆటగాళ్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు తమ జట్టు ప్లేయర్ పూర్తిగా అర్హులు అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.
జోస్ బట్లర్‌తో కలిసి బ్యాటింగ్‌ను తాను ఎంతో ఆస్వాదించినట్లు హ్యారీ బ్రూక్ చెప్పాడు. ‘బట్లర్, నేను క్రీజులో చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం. ఒకరికొకరం బాగా సహకరించుకున్నాం. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశాం. బౌండరీలు బాదాం. జోస్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. మా మధ్య ఎలాంటి వ్యక్తిగత పోటీ లేదు. జట్టుకు భారీ స్కోరు అందించి ప్రత్యర్థి ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచడమే మా టార్గెట్. ఈ మ్యాచ్‌లోనే కాదు.. సిరీస్ మొత్తంను బాగా ఎంజాయ్ చేశా. టీమిండియా బౌలింగ్ బలహీనంగా కనిపించింది’ అని బ్రూక్ పేర్కొన్నాడు.
క్రికెట్ చాలా సులభమైన ఆట అని, కానీ ఆటగాళ్లే దానిని అనవసరంగా క్లిష్టంగా మార్చుకుంటారని ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బంతిని చివరి వరకు జాగ్రత్తగా చూడటమే నా లక్ష్యం. ఏ బంతికి ఎలాంటి షాట్ అవసరమో అదే ఆడాలని అనుకున్నాను. ప్రస్తుతం బంతిని చాలా బాగా టైమ్ చేస్తున్నాను. నా ఆట కూడా మంచి స్థితిలో ఉందని భావిస్తున్నాను’ అని తెలిపాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం తమకు ఎంతో ప్రత్యేకమని బ్రూక్ చెప్పాడు. ‘రెండో మ్యాచ్ తర్వాత నంబర్‌వన్ స్థానానికి చేరుకోవాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుందని తెలిసింది. దానిని లక్ష్యంగా పెట్టుకుని జట్టు అద్భుతంగా ఆడింది. ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలనే లక్ష్యంను సాధించాం. జట్టులోని ఆటగాళ్లందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు మేం అర్హులమే’ అని బ్రూక్ అన్నాడు.
ఇంగ్లండ్ విజయాల్లో స్పిన్నర్ల పాత్రను కూడా బ్రూక్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘మా స్పిన్నర్లు తెలివిగా బౌలింగ్ చేశారు. జట్టులో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన స్పిన్నర్లు ఉన్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను నిరంతరం ఆలోచనలో పడేస్తున్నారు. నా కెప్టెన్సీలో స్పిన్ బౌలింగ్‌ను ఎక్కువగా ఉపయోగించా. స్పిన్నర్లు అద్భుతమైన ఫలితాలు అందించారు. బౌలింగ్‌లో స్పష్టమైన ప్రణాళికతో పాటు ఆటగాళ్ల మధ్య మంచి కమ్యూనికేషన్ మా విజయానికి ప్రధాన కారణం. సమష్టి ప్రదర్శన, స్పష్టమైన వ్యూహాలు, అద్భుతమైన అమలుతోనే ఇంగ్లండ్ ప్రపంచ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది’ హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు.