July 12, 2026

12.5% అదనపు టారిఫ్‌‌లను వెనక్కి తీస్కోండి…అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌‌కు భారత్ విజ్ఞప్తి

12.5% అదనపు టారిఫ్‌‌లను వెనక్కి తీస్కోండి...అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌‌కు భారత్ విజ్ఞప్తి
Reading Time: < 1 minute

12.5% అదనపు టారిఫ్‌‌లను వెనక్కి తీస్కోండి…అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌‌కు భారత్ విజ్ఞప్తి

Caption of Image.
  •     వెట్టిచాకిరీపై యూఎస్‌‌టీఆర్ నివేదికలో లోపాలు 
  •     ఏకపక్ష నిర్ణయాలొద్దు.. చర్చలతో పరిష్కరించుకోవాలని పిలుపు

వాషింగ్టన్: భారత్‌‌లో వివిధ వస్తువుల తయారీలో వెట్టిచాకిరీ(ఫోర్స్డ్‌‌ లేబర్) కొనసాగుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్‌‌టీఆర్) ఇచ్చిన నివేదికలో లోపాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. యూఎస్‌‌టీఆర్ సెక్షన్ 301 కింద జరిపిన దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని తెలిపింది. భారత్‌‌లో వెట్టిచాకిరీ నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అందుకే, వెట్టిచాకిరీ నెపంతో 12.5 శాతం అదనపు టారిఫ్‌‌లు విధించాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరింది. 

వాణిజ్య సమస్యలను ఏకపక్ష చర్యల ద్వారా కాకుండా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ విషయమై ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. వెట్టిచాకిరీ నిర్మూలన సమస్యలపై భారత్ ఎంతో నిజాయతీతో పనిచేస్తోందని, ఈ నేపథ్యంలో యూఎస్‌‌టీఆర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా, అంతర్జాతీయ చట్టాలు, సూత్రాల ప్రకారం వెట్టిచాకిరీని నిర్మూలించడాన్ని భారత్ ఎంతో తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు. 

ట్రేడ్ యాక్ట్ లోని సెక్షన్ 301(డీ) ప్రకారం నిర్దేశించిన చట్టపరమైన ప్రమాణాలను యూఎస్‌‌టీఆర్ నెరవేర్చలేదు. ఇతర చట్టబద్ధమైన అవసరాలకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, కేవలం వెట్టిచాకిరీ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించలేదనే కారణంతో దానిని సెక్షన్ 301 కింద అసమంజసమైన చర్యగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు. జులై 8న జరిగిన విచారణకు సంబంధించిన లిఖితపూర్వక ప్రతిని యూఎస్‌‌టీఆర్ వెబ్‌‌సైట్‌‌లో ప్రచురించారు. దాని ప్రకారం, దేశవ్యాప్త పన్నులకు యూఎస్‌‌టీఆర్ నిర్ణయం ఎటువంటి హేతుబద్ధమైన కారణాన్ని చూపడం లేదు. భారత్‌‌తో సహా 46 ఆర్థిక వ్యవస్థలను ఒకే వర్గంలోకి చేర్చడం సరికాదని భారత్ పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.